Reading Time: 2 minutes

భారత్ vs శ్రీలంక టెస్ట్ మ్యాచ్ని ఆడ్డుకున్న వరుణుడు.. భయంలో టీమిండియా

Caption of Image.

IND vs SL: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈరోజు (శనివారం, ఆగస్టు 15) ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజే వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభమై టీమిండియా నిలకడగా ఆడుతున్న సమయంలో ఉన్నట్టుండి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో మ్యాచ్ అధికారులకు లంచ్ విరామాన్ని పొడిగించడం మినహా వేరే మార్గం లేకుండా పోయింది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 101 రన్స్ చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (32 పరుగులు*), దేవదత్ పడిక్కల్ (35 పరుగులు*) నిలకడగా రాణిస్తుండగా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32) రనౌట్ రూపంలో దురదృష్టవశాత్తూ వెనుతిరిగాడు.

రెండో రోజు ఆటకు కూడా జల్లుల గండం: 

ప్రస్తుతం గాలేలో తేమ శాతం 83కి చేరడంతో వాతావరణం మైదానంలో ఆటకు అనుకూలంగా కనిపించడం లేదు. అయితే ఆక్యువెదర్ అంచనాల ప్రకారం మధ్యాహ్నం వేళ వర్షం పడే అవకాశం 25 శాతానికి తగ్గుతుందని తెలుస్తోంది. కాబట్టి మైదానాన్ని ఎండబెడితే మొదటి రోజు ఆట త్వరలోనే పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు రాత్రి నుంచి రేపు (ఆదివారం) ఉదయం వరకు మళ్లీ వర్ష సూచన ఉండటంతో.. లంకతో జరుగుతున్న ఈ తొలి టెస్టు రెండో రోజు (Day 2) ప్రారంభం కూడా ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

వర్షం వల్ల మ్యాచ్ డ్రా అవుతుందా?: 

చారిత్రాత్మక గాలే స్టేడియంలో జరుగుతున్న 50వ టెస్టు మ్యాచ్ ఇది. ఈ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన 50 టెస్టుల్లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే వర్షం లేదా బ్యాటర్ల ధాటికి డ్రాగా ముగిశాయి. మిగిలిన మ్యాచ్‌లలో శ్రీలంక 27 సార్లు గెలవగా, పర్యటక జట్లు 15 సార్లు విజయం సాధించాయి. సాధారణంగా గాలే పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తూ ఫలితాన్ని ఇచ్చే మైదానంగా పేరుగాంచింది. అందువల్ల వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయినా, సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

►ALSO READ | సర్ఫరాజ్‌కు అన్యాయం.. గాలే టెస్ట్‌లో ఛాన్స్ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్!

వర్షం పడితే భారత్‌కే నష్టం:  

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాకు ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) సైకిల్‌లో వర్షాల వల్ల మ్యాచ్ డ్రాగా మారడం అస్సలు ఇష్టం లేదు. భారత్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో 4 విజయాలు, 4 ఓటములతో 48.15 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడిస్తున్న బంగ్లాదేశ్ 58.33 శాతంతో 4వ స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో బలంగా నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్‌లో ప్రతి విజయమూ చాలా కీలకం. ఈ టెస్టు ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్‌ఎస్‌సి స్టేడియంలో జరగనుంది.

©️ VIL Media Pvt Ltd.