Reading Time: < 1 minute
Cm Vijay Bus Ride Chennai New Government Buses Viral Photos Video

తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ గురువారం చెన్నైలో కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 300 కొత్త ప్రభుత్వ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం.. బస్సులో ప్రయాణిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బస్సు సిబ్బందితో మమేకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన బస్సుల్లో విజయ్ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా బస్సు డ్రైవర్, కండక్టర్‌లతో మాట్లాడి వారి పనితీరును తెలుసుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి.

తెల్ల చొక్కా, కళ్లజోడుతో కనిపించిన విజయ్ బస్సులో కూర్చుని ప్రయాణించగా.. ఆయన వెంట వచ్చిన మంత్రులు సమీపంలో నిలబడి ఉన్నారు. ఒక వీడియోలో విజయ్ కండక్టర్‌తో సుదీర్ఘంగా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. మరో వీడియోలో ఆయన కండక్టర్‌తో కలిసి ఫొటోకు పోజ్ ఇచ్చారు. అలాగే డ్రైవర్ భుజంపై ప్రేమగా చేయి వేసి అభినందించిన దృశ్యాలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. బస్సు ప్రయాణం మొత్తం సమయంలో రహదారుల వెంట నిలిచిన ప్రజలకు విజయ్ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. దీంతో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు చేరుకున్నారు.

ఈ 300 కొత్త బస్సులను తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ నిర్వహించిన ప్రధాన ప్రజా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.