Reading Time: < 1 minute
Telangana Ssc Supplementary Results 2026

SSC Supplementary Results : తెలంగాణ పదో తరగతి (SSC) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. రెగ్యులర్ ఫలితాల మాదిరిగానే ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే మరోసారి తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 31,736 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. వారిలో 27,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రికార్డు స్థాయిలో 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61 శాతంగా నమోదైంది.

మరోసారి ఫలితాల్లో బాలికలు అదరగొట్టారు. పరీక్షలకు హాజరైన వారిలో 17,568 మంది బాలురు ఉండగా, అందులో 14,281 మంది పాసయ్యారు. అంటే బాలుర ఉత్తీర్ణత శాతం 81.29 శాతంగా ఉంది. అదేవిధంగా పరీక్ష రాసిన 10,289 మంది బాలికల్లో 8,732 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 84.87 శాతంగా నమోదైంది. మొత్తంగా బాలికలు బాలుర కంటే 3.58 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు. ఈ ఫలితాల్లో జిల్లాల వారీగా చూస్తే.. జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, ములుగు జిల్లాలు 100 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాయి. కాగా, వికారాబాద్ జిల్లా కేవలం 44.43 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది.