
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను, నాణ్యతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గతంలో సెప్టెంబర్ 2024 లో లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీకి గురైందనే వివాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అక్రమాల వల్ల ఐదేళ్లలో దాదాపు రూ. 234 కోట్ల నష్టం వాటిల్లిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నిర్ధారించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఆధారాలు లభించకపోయినప్పటికీ, వెజిటబుల్ ఆయిల్స్, రసాయన పదార్థాలు కలిసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో.. భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ప్రసాదం చుట్టూ ఉన్న వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి టీటీడీ సరికొత్త సాంకేతిక, శాస్త్రీయ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది.
కల్తీకి తావులేకుండా ఉండేందుకు టీటీడీ తన నాణ్యత నియంత్రణ ప్రమాణాలను సమూలంగా మార్చేసింది. గతంలో కేవలం 8 రకాలుగా ఉన్న నెయ్యి నాణ్యత పరీక్షలను, ఇప్పుడు ఏకంగా 24 పారామీటర్లకు పెంచింది. గతంలో టెండర్లలో అతి తక్కువ ధరకు రూ.320 నుండి రూ.411 నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్ల లోపాలను గుర్తించి, ప్రస్తుతం మదర్ డెయిరీ, నందిని, ఇందాపుర్ డెయిరీ వంటి నమ్మకమైన సంస్థల నుండి ప్రతి కిలో నెయ్యిని సుమారు రూ.650 ధరతో సేకరిస్తోంది. దీనికి తోడు తిరుమలలో రూ.23.5 కోట్ల ఖర్చుతో FSSAI ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏఐ ఆధారిత ‘ఈ-నోస్’, ‘ఈ-టంగ్’ టెక్నాలజీలను వాడుతున్నారు. ఇది నెయ్యిలోని ప్రిజర్వేటివ్‌లు, పెస్టిసైడ్స్, బీటా-సిటోస్టెరాల్ వంటి కల్తీలను ఇట్టే పసిగట్టేస్తుంది.
ఈ క్రమంలోనే మరో చారిత్రాత్మక అడుగు వేస్తూ.. మైసూర్ కేంద్రంగా పనిచేసే ‘సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (CFTRI) తో టీటీడీ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే ఒక పెద్ద దేవాలయం ఇలాంటి శాస్త్రీయ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. బెంగళూరులో జరిగిన రీసెర్చ్, ఇండస్ట్రీ, స్టార్టప్ కాన్క్లేవ్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. ప్రసాదాల తయారీ, నిల్వ, పంపిణీలలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేస్తారు.
ALSO READ : పోస్టాఫీస్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్
ప్రసాదాల రుచి, సంప్రదాయ విలువలు దెబ్బతినకుండా వాటి షెల్ఫ్-లైఫ్ పెంచేందుకు ప్యాకేజింగ్ టెక్నాలజీపై సంయుక్తంగా పనిచేస్తారు. అలాగే సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తలు క్రమం తప్పకుండా తిరుమలను సందర్శిస్తూ, అక్కడి సిబ్బందికి అధునాతన పరీక్షలపై శిక్షణ ఇస్తారు. ఈ సంచలన మార్పులతో శ్రీవారి ప్రసాదాల పవిత్రత మరింత పెరగడమే కాకుండా.. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని టీటీడీ భావిస్తోంది.