
లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్స్, ఫోన్ కాంటాక్ట్స్‌లో వందల కొద్దీ నంబర్లు, రోజంతా వాట్సాప్‌లో మెసేజ్‌ల నోటిఫికేషన్లు.. అయినా సరే, లోపల ఏదో తెలియని ఒంటరితనం వేధిస్తోందా? అయితే మీరు ఒంటరి కాదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువత ప్రస్తుతం స్నేహితుల కొరత అనే విచిత్రమైన సంక్షోభం వేధిస్తోంది. ఒకప్పుడు స్నేహితులతో కళకళలాడిన మానుషుల జీవితం.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ల వెనుక ఒంటరిదైంది. సమయం లేదు మిత్రమా అంటే లైఫ్ లో ఎంత నష్టమో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
మారిపోయిన కాలం.. కరిగిపోయిన స్నేహాలు
1960ల కాలంలో ఒక్కొక్కరికి సగటున 100 మంది స్నేహితులు ఉండేవారట. 1990ల నాటికి ఆ సంఖ్య 50కి, 2020 నాటికి 10కి పడిపోయింది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒకే ఒక్క నిజమైన స్నేహితుడు ఉండటం కూడా గగనమైపోతోంది. ఒక సర్వే ప్రకారం.. దేశంలో దాదాపు 12% మందికి అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా స్నేహితులు లేరట. గతంలో స్నేహితులతో గడిపే సమయం రోజుకు సగటున 1 గంట ఉంటే.. ఇప్పుడది కేవలం 35 నిమిషాలకు పడిపోయింది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం.. గత దశాబ్దంలో యువతలో ఒంటరితనం 30% పైగా పెరిగిందని తేలింది. ప్రస్తుతం ఉన్న జెన్ జెడ్ యువతలో 27 శాతం మందికి తమ ఫ్యామిలీ బయట ఒక్క స్నేహితుడు కూడా లేరని తేలింది. ఇక 20 శాతం మందికి అసలు క్రోజ్ ఫ్రెండ్ అనేవాళ్లే లేరట.
మనుషులకు స్నేహితులు ఎందుకు కావాలి?
మానవ పరిణామక్రమంలోనే ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం అనేది జీవన విధానంలో భాగం. మంచి స్నేహితులు మన జీవితానికి ఒక ‘లైఫ్ ఇన్సూరెన్స్’ లాంటి వారు. స్నేహం అనేది కేవలం కాలక్షేపం కాదు.. అది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఒక సంజీవని అని పరిశోధనలు చెబుతున్నాయి.
* ఆరోగ్యకరమైన గుండె, బీపీ నియంత్రణ: మంచి స్నేహితుల సాంగత్యంలో ఉండేవారిలో బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుందని, గుండె జబ్బుల ప్రమాదం చాలా తక్కువని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
* రోగ నిరోధక శక్తి పెరుగుదల: స్నేహితులతో కలిసి నవ్వడం, బాధలను పంచుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు తగ్గి, రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
* ఆహ్లాదకరమైన జీవనశైలి: తోడుగా స్నేహితులు ఉన్నవారు నిరాశలో మునిగిపోకుండా వ్యాయామం, స్పోర్ట్స్, ఇతర సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
ALSO READ : జాబ్ మానేసి.. రూ. 30 లక్షల లోన్ తీసుకుని..
ఒంటరితనం.. రోజుకు 20 సిగరెట్లతో సమానం
స్నేహితులు లేకపోవడం వల్ల వచ్చే ఒంటరితనం కేవలం మనసుకే కాదు.. శరీరానికి కూడా ప్రాణాంతకమే. పరిశోధనల ప్రకారం దీర్ఘకాలిక ఒంటరితనం వల్ల కలిగే స్ట్రెస్.. రోజుకు 15 నుండి 20 సిగరెట్లు తాగినంత నష్టాన్ని శరీరానికి కలిగిస్తుందని తేలింది. ఇది నిద్రలేమికి, డిప్రెషన్‌కు, మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి దారితీస్తుంది.
డిజిటల్ స్నేహాలు.. ముచ్చట్లేనా?
ఫేస్‌బుక్ లైక్‌లు, వాట్సాప్ ఎమోజీలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మనకు కనెక్టివిటీని ఇచ్చాయే కానీ కనెక్షన్ ను ఇవ్వలేవు. ఇవన్నీ కేవలం పైపైన ముచ్చట్ల లాంటివే. మనం పని చేసే చోట ఉండే స్నేహాలు చాలా వరకు ప్రయోజనాల కోసమే ఉంటుంటాయి. ఇక బార్ అండ్ రెస్టారెంట్ స్నేహాలైతే మత్తు ఉన్నంత వరకే పరిమితం. నిజమైన స్నేహానికి కావాల్సిన హావభావాలు, గొంతులోని ఆత్మీయత ఈ డిజిటల్ ప్రచారంలో కరువవుతున్నాయి.
ఫ్రెండ్‌షిప్ కోసం సమయం అనే ఇన్వెస్ట్‌మెంట్!
స్నేహాలు ఊరికే ఏర్పడవు. స్నేహానికి కావాల్సిన అతిపెద్ద పెట్టుబడి సమయం. మనం రోజూ జీవితంలో కొంత సమయాన్ని వారితో గడిపేందుకు, మాట్లాడేందుకు, డిస్కర్ చేసేందుకు, ఆడుకునేందుకు లేదా ఇతర రూపాల్లో కేటాయిస్తేనే అది మన మనస్సు, ఆరోగ్యాన్ని కాపాడుతుందట. ఒక వ్యక్తితో కనీస పరిచయం ఏర్పడాలంటే కనీసం 40 గంటలు కలిసి గడపాలి. ఒక మోస్తరు స్నేహం కావాలంటే మరో 90 గంటలు పడుతుంది. అదే ప్రాణ స్నేహంగా మారాలంటే ఇంకో 40 గంటల సమయం అవసరం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నేటి బిజీ లైఫ్‌లో మన దగ్గర అంత సమయం ఎక్కడుంది? సమయం లేదు మిత్రమా అనేదే నేటి తరంలో స్నేహాలు విడిపోవడానికి అతిపెద్ద కారణమని తేలింది.
మరి స్నేహాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
మంచి స్నేహాలను నిలుపుకోవాలంటే రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. కేవలం అవసరం ఉన్నప్పుడే కాకుండా గుర్తుకు వచ్చావు అంటూ మెసేజ్ చేయడం, వీకెండ్స్‌లో కాఫీకి కలవడం వంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. ఆఫీస్ గ్రూపులు, క్లబ్‌లు, వాలంటీర్ సంస్థల్లో చేరడం ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. సోషల్ మీడియా స్క్రీన్లను పక్కన పెట్టి, మనుషులతో ముఖాముఖి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. సమయాన్ని కేటాయించండి.. మంచి స్నేహాలను గెలుచుకోండి. ఎందుకంటే జీవితంలో ఎంత సంపాదించినా, కష్ట సుఖాలను పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడు లేకపోతే ఆ జీవితం శూన్యమే.