
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 లోని కొన్ని మార్గదర్శకాలపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. వచ్చే మంగళవారం.. అంటే జూన్ 30వ తేదీ వరకు ఈ స్టే విధిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించరు.. అటు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటే కాలేజీలను యాజమాన్యాలు ఎలా నడుపుతాయి? అని నిలదీసింది. అసలు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు? బడ్జెట్ సెషన్ పూర్తయినా బకాయిలు ఎందుకు విడుదల చేయలేదు? పెండింగ్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
►ALSO READ | 1967 పాస్ పోర్ట్ చట్టం ఏం చెబుతోంది.. ఇన్నాళ్లు పాస్ పోర్ట్ అంటే పౌరసత్వం అనే భావన ఎందుకు ఉంది..?
దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. రాబోయే ఆగస్టు 15 లోపు పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం గనుక ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లిస్తే.. తాము వేసిన పిటిషన్లన్నింటినీ అదే రోజు వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా కోర్టుకు స్పష్టం చేశాయి.
మరోవైపు.. ప్రభుత్వం, కాలేజీల గొడవల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారంటూ విద్యార్థుల తరపు న్యాయవాది ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫీజుల బకాయిల రచ్చ వల్ల 2, 3, 4వ సంవత్సరం చదువుతున్న పాత విద్యార్థులు నష్టపోకుండా చూడాలని.. ఈ కొత్త నిబంధనలను ఈ ఏడాది జాయిన్ అయ్యే కొత్త విద్యార్థులకే వర్తింపజేసేలా చూడాలని కోర్టును కోరారు.దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.