
ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధానమైన వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త రూపు సంతరించుకుంది. 2024లో వచ్చిన వరద ధాటికి కొట్టుకుపోయిన 19వ గేటును నిపుణుల కమిటీ సూచనతో 33 గేట్లు అమర్చారు. 6 నెలల్లో 51 కోట్లతో నిర్మితమైన ఈ గేట్లను గురువారం ( జూన్ 25 ) మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. మూడు తరాల సమస్య 33 గేట్ల ప్రారంభంతో తీరబోతోంది అన్నారు.
33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు సీఎం రేవంత్. తక్కువగా మాట్లాడటం, వేగంగా పని చేయడం పాటిల్ స్పెషాలిటీ అని..ఏ సమస్యనైనా పాటిల్ నూటికి నూరుపాళ్లు పరిష్కరిస్తారని అన్నారు. పాటిల్ నేతృత్వంలో ఇక్కడి తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని అన్నారు. తుంగభద్రమ్మ సాక్షిగా ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు.
RDS లో కేవలం 5 టీఎంసీలే మేము వాడుకుంటున్నామని..తుంగభద్రలో పూడికతీత సమస్యను పరిష్కరించాలని అన్నారు. సమస్య పరిష్కారం కోసం కలిసి పని చేయాలని నిర్ణయించామని అన్నారు సీఎం రేవంత్. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నది ఒడ్డున చర్చించామని..అంతర్రాష్ట్ర జలవివాదాలకు శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు సీఎం రేవంత్.