
Shwetha Menon: మలయాళ చిత్రసీమకు చెందిన నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)’లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీల వివాదాలు ముదరడంతో ‘అమ్మ’ అధ్యక్షురాలు, ప్రముఖ నటి శ్వేతా మేనన్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరూ తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కేవలం పదవికే కాకుండా, అమ్మ సంస్థ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు శ్వేతా మేనన్ ప్రకటించడంతో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా రాజీనామా అనంతరం శ్వేతా మేనన్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మా కమిటీని తొలగించే దురుద్దేశంతో కొందరు తెరవెనుక ఎజెండాను అమలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరికి కమిటీ బాధ్యతలు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. నా హయాంలో ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగాయి. గత కమిటీలో ఉన్న బాబూరాజ్ పాలనలోనే ఆర్థిక, పరిపాలన అవకతవకలు జరిగాయి” అని శ్వేత స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో మలయాళ చిత్ర పరిశ్రమలో తదుపరి ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో శ్వేతా మేనన్ అధ్యక్షురాలిగా, డబ్బింగ్ కళాకారిణి కుక్కు పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ‘అమ్మ’ చరిత్రలోనే ఇద్దరు మహిళలు అత్యున్నత పదవులు చేపట్టడం ఇదే తొలిసారి.
అయితే, బాధ్యతలు స్వీకరించిన ఏడాది కూడా పూర్తికాకముందే ఈ కమిటీ వైదొలగడం గమనార్హం. ఇటీవల మాజీ జాయింట్ సెక్రటరీ అన్సిబా హసన్ చేసిన సంచలన ఆరోపణలతో ఈ సంక్షోభం మొదలైందని చెబుతున్నారు. కార్యవర్గంలోని కొందరు సభ్యులు తనను మతపరమైన కోణంలో లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని అన్సిబా హసన్ ఆ సమయంలో ఆరోపించారు. సంస్థ కార్యక్రమాలకు మత సంస్థలను స్పాన్సర్లుగా తీసుకురావడాన్ని ప్రశ్నించినందుకు తనను ఒంటరిని చేశారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఉపాధ్యక్షురాలు లక్ష్మీప్రియ కూడా సంస్థ పనితీరులో పారదర్శకత లోపించిందని ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది.