Reading Time: 2 minutes

ఫుట్పాత్పై నడిచే హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన సుప్రీం కోర్టు

Caption of Image.

ఢిల్లీ: ఫుట్పాత్పై నడిచే హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు శుక్రవారం ప్రకటించింది. గుర్తించబడిన ఫుట్‌పాత్‌పై నడవడానికి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు, మోటారు వాహనాల రాకపోకల కంటే ప్రధానమైనదని జస్టిస్‌ పి.ఎస్. నరసింహ, ఎ.ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక ముఖ్యమైన తీర్పులో, ఆర్టికల్ 19 (1) (డి) కింద హామీ ఇవ్వబడిన సంచార హక్కుతో పాటు, ఆర్టికల్ 21 – జీవించే, స్వేచ్ఛ హక్కుతో సహా ఇతర ప్రాథమిక హక్కులలో ఇది ఒక భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ప్రభుత్వాలు ఈ మేరకు చట్టం తీసుకురావాలని.. పాదచారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, సరిహద్దులు గుర్తించడం పురపాలక అధికారులు, స్థానిక సంస్థల విధి అని గుర్తించే చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది. 

►ALSO READ | NEET కేటుగాళ్ల కలకలం.. VPN వాడినా దొరికిపోయిన 19 ఏళ్ల విద్యార్థి..

ఐదేళ్ల పిల్లాడి మరణానికి సంబంధించిన ప్రమాదం కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువడింది. తండ్రీకొడుకులు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా.. మితిమీరిన వేగంతో వచ్చిన ఒక ట్యాంకర్ ఆ పిల్లాడిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ధాటికి అతని నడుము, శరీర దిగువ భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. 2016 మే 30న, మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) సంవత్సరానికి 6 శాతం వడ్డీతో పాటు రూ. 7.82 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. బీమా కంపెనీ ఈ నిర్ణయంపై అప్పీల్ చేసిన తర్వాత, హైకోర్టు పరిహారాన్ని రూ. 4.70 లక్షలకు తగ్గించింది. MACT మంజూరు చేసిన పరిహారాన్ని తగ్గించి హైకోర్టు పొరపాటు చేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దానిని రూ. 11,44,628 కు పెంచి, రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసులో తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదం జరిగిన రోడ్డుపై ఫుట్‌పాత్ గానీ, పాదచారి క్రాసింగ్ గానీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాకుండా.. రహదారుల వినియోగానికి సంబంధించిన మన హక్కుల వ్యవస్థను పునర్నిర్మించి, వాటికి సంబంధించిన విధులను గుర్తించే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని దేశ అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది.

©️ VIL Media Pvt Ltd.