Reading Time: 2 minutes
Successful Chinese Woman Cries For Marriage Viral Video

China Women: “మంచి ఉద్యోగం ఉంది.. ఏడాదికి రూ.58 లక్షల సంపాదన ఉంది.. సమాజంలో ఉన్నత హోదా ఉంది.. కానీ, పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు!” వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. “ప్లీజ్.. నన్నెవరైనా పెళ్లి చేసుకోండి” అంటూ ఒక కోటీశ్వరురాలు రోడ్డుపై గుక్కపెట్టి ఏడ్చిన హృదయవిదారక దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. కేవలం 30 ఏళ్లు దాటాయనే ఒకే ఒక్క కారణంతో, ఆమె సాధించిన విజయాలన్నింటినీ పక్కన పెట్టి చైనా సమాజం ఆమెను ఎలా వెలివేసిందో చూపే షాక్‌కు గురవుతారు. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చైనాలోని సాంప్రదాయ వివాహ మార్కెట్ (Bride’s Market) లో ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన కొడుకులకు వధువును వెతకడానికి పొరుగు నగరం నుంచి వచ్చిన కొందరు తల్లిదండ్రుల ముందు ఆమె తన బాధను వెళ్లగక్కింది. “నేను ఏడాదికి 5,00,000 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.58 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాను. మంచి ఉద్యోగం ఉంది, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాను. కానీ నాకు 30 ఏళ్లు దాటాయనే ఒకే ఒక్క కారణంతో నన్నెవరూ పట్టించుకోవడం లేదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చైనా సమాజంలో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలను ‘షెంగ్ ను’ (Sheng Nu) లేదా ‘లెఫ్ట్ ఓవర్ ఉమెన్’ (మిగిలిపోయిన మహిళలు) అని పిలుస్తారు.

వారు ఎంతటి ఉన్నత చదువులు చదివినా, కెరీర్‌లో ఎంతటి విజయాలు సాధించినా.. వయసు ముదిరిందనే కారణంతో పెళ్లికి పనికిరారని అక్కడి సాంప్రదాయ కుటుంబాలు భావిస్తాయి. మహిళల విజయాల కంటే వారి వయసుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ ఆలోచనా విధానంపై, ఆధునిక చైనీస్ యువతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంపాదన, అర్హత అన్నీ ఉన్నా.. వయసును బట్టి జీవిత భాగస్వామి అర్హతను నిర్ణయించడం ఎంతవరకు న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు తెరలేపింది.