
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈ సారి ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. 2023 డిసెంబర్ లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌లో గంభీర్‌తో జరిగిన వాగ్వాదం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఆ మ్యాచ్ లో గంభీర్ తనను ఫిక్సర్ అని పిలిచాడని ఆ మధ్య శ్రీశాంత్ ఆరోపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై మరోసారి మాట్లాడుతూ.. గంభీర్ తనను దేశద్రోహి అని ముద్ర వేశాడని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఆ మ్యాచ్ లో గంభీర్‌కు బౌన్సర్ వేసిన తర్వాత ఈ వాగ్వాదం జరిగినట్లు చెప్పాడు.
గౌతీ (గంభీర్) మొదటి బంతికి ముందుకు వచ్చి ఫ్లిక్ చేశాడు, ఎందుకంటే అతనికి నా ఆట తెలుసు. అతని కోచింగ్ విషయం తెలియదు కానీ, అతను చాలా మంచి క్రికెటర్ నాకుతెలుసు. అందుకే నేను బౌన్సర్ వేశాను.. అని లల్లన్ టాప్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చెప్పాడు.
ఆ సందర్భంగా గౌతీ నన్ను అనకూడని మాట అనేశాడు, ఫిక్సర్ అని పిలిచాడు, అని చెప్పాడు. నేను ముందుకు వంగి, గౌతీ భాయ్, మీరు బాగానే ఉన్నారా? అని అడిగాను. అప్పుడు అతను ‘ఎఫ్ఎఫ్’ (F-word) అనే బూతు పదాన్ని వాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిక్సర్, దేశద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.
గంభీర్, శ్రీశాంత్, ఇండియా తరఫున 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఉన్నారు. అయితే వారి కెరీర్ ముగిసిన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఐపీఎల్ 2013 సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత శ్రీశాంత్‌కు విధించిన నిషేధం ఆధారంగానే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొదట జీవితకాలం నిషేధం విధించగా.. ఆ తర్వాత ఏడేళ్ల కు తగ్గించింది బీసీసీఐ.