Reading Time: < 1 minute
నీతో ఫొటో కోసం అలా చేయాల్సిన అవసరం నాకు లేదు! ట్రంప్‌కు మెలోని కౌంటర్

ఫ్రాన్స్‌లో జరిగిన G7 సమ్మిట్ 2026 అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా వివాదానికి దారితీశాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగేందుకు వేడుకున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మెలోని తీవ్రంగా ఖండించారు. ఇటాలియన్ టీవీ చానల్ La7కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. జీ7 సమావేశంలో మెలోని తనతో ఫొటో దిగాలని ఉబలాటపడ్డారని, ఆమె అభ్యర్థనతోనే తాను ఫొటోకు అంగీకరించానని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మెలోని పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు.

“నేను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరినీ బతిమిలాడం” అంటూ ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ మిత్రదేశాల నాయకులతో ఇలా వ్యవహరించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఈ వివాదం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజాని ట్రంప్ వ్యాఖ్యలను “ఇటలీ దేశానికే అవమానం”గా అభివర్ణిస్తూ.. జూన్ 21–22 తేదీల్లో అమెరికాలో జరగాల్సిన తన అధికారిక పర్యటనను రద్దు చేసుకున్నారు.

గత కొద్ది నెలలుగా ట్రంప్, మెలోని మధ్య సంబంధాలు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇరాన్ అంశం, అలాగే పోప్‌పై ట్రంప్ చేసిన విమర్శల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. అయినప్పటికీ ఇటీవల జీ7 సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయి సంబంధాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అప్పట్లో “మేమెప్పుడూ స్నేహితులమే” అని మెలోని వ్యాఖ్యానించారు. అయితే తాజా ఫొటో వివాదం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న వాషింగ్టన్–రోమ్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇటలీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి