Reading Time: < 1 minute
Iran Closes Strait Of Hormuz Again Accuses Us Of Violating Peace Agreement

Iran vs US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటం, అమెరికా ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లు ప్రకటించారు. అయితే దక్షిణ లెబనాన్ నుంచి దళాల ఉపసంహరణ జరగకపోవడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జలసంధిని మళ్లీ మూసివేయడం ద్వారా ఒప్పంద భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

‘ఇది తొలి అడుగు మాత్రమే’.. ఇరాన్ హెచ్చరిక

హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించడం కేవలం తొలి చర్య మాత్రమేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఒప్పంద ఉల్లంఘనలు కొనసాగితే మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం ఏడుగురు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.

ఇరాన్ చేరుకున్న పాకిస్తాన్ మంత్రి

ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఇరాన్‌కు చేరుకున్నారు. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య జరుగుతున్న చర్చలను ఆయన పర్యవేక్షించే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఆయన పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది.