శుభ గ్రహాల మధ్య పరివర్తన వల్ల తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. అందులోనూ గురువుతో పరివర్తన కలిగినప్పుడు నూరు శాతం శుభ యోగాలు కలుగుతాయి. ఈ నెల(జూన్) 29, 30, జూలై 1 తేదీల్లో చంద్ర, గురు గ్రహాల మధ్య అరుదైన పరివర్తన జరుగుతోంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలతో కొన్ని రాశుల వారికి ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడి సంచారం వల్ల ఈ పరివర్తన కలిగింది. మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి రాజయోగాలు కలిగే అవకాశం ఉంది.
మేషం: ఈ రాశికి చతుర్థ, భాగ్య స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశీ సంపా దన యోగం పడుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు, వాహనం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.
మిథునం: ఈ రాశికి ధన, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము, మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. కెరీర్ పరంగా శీఘ్ర పురోగతి ఉంటుంది.
కన్య: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆస్తిపాస్తులు కలిసివస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఇల్లు, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
తుల: ఈ రాశికి తృతీయ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కెరీర్ పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.
వృశ్చికం: ఈ రాశికి ధనాధిపతి అయిన గురువుకు, భాగ్యాధిపతి అయిన చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది.
మీనం: పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువుకు, దశమంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా లాభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాల్ని మించిన లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. సీనియర్ ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.






