
మరికల్, వెలుగు : చదువుకున్న పాఠాలను నిత్యం చదువుకుంటే గొప్ప లక్ష్యాలను సులువుగా చేరుకుంటామని నారాయణపేట కలెక్టర్ సీహెచ్. ప్రియాంక చెప్పారు. శనివారం మరికల్ మండలంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్స్, గ్రూప్స్ పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, 9వ తరగతి నుంచి ఇంటర్ వరకున్న సైన్స్, గణితం, సోషల్ పుస్తకాల్లోని ప్రశ్నలే ఆయా పోటీ పరీక్షల్లో వస్తాయన్నారు.
అనంతరం లైబ్రరీని, స్టోర్ రూంలలో ఉన్న కూరగాయలను, సరుకులను పరిశీలించారు. కూరగాయలు బాగలేవని, తాజా కూరగాయలను సరఫరా చేయాలని డీఈవోను ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ప్రత్యేక బహుమతి ఇస్తానని హామీ ఇచ్చారు.