Reading Time: < 1 minute
ఇంటి నుంచి బయలుదేరిన క్షణాల్లోనే విషాదం.. హిట్ అండ్ రన్‌లో నర్స్ మృతి (వీడియో)

హైదరాబాద్: నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో ఓ మహిళా నర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం డ్రైవర్ తన స్నేహితులతో కలిసి కారును అక్కడే వదిలేసి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

మృతురాలిని ఫహీమున్నిస్సా (35)గా గుర్తించారు. ఆమె స్థానికంగా నివసిస్తూ వృద్ధికాబా ఆసుపత్రిలో సీనియర్ నర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రతిరోజులాగే ఆదివారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఫహీమున్నిస్సా.. ఇంటి సందు నుంచి మెయిన్ రోడ్డుపైకి రాగానే ప్రమాదానికి గురయ్యారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, AP 05 BH 3456 నంబర్ గల టొయోటా ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, వాహన యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు సెల్ఫ్ డ్రైవ్‌కు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రాథమిక దర్యాప్తులో, కారును అద్దెకు తీసుకున్న వారు ఆసిఫ్‌నగర్‌కు చెందిన యువకులుగా గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే వారు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కారులో లభ్యమైన కింగ్‌ఫిషర్ బీర్ బాటిళ్ల మూతలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఈ ఘటనతో హిల్ కాలనీ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న ఫహీమున్నిస్సా మృతితో ఆమె బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హిట్ అండ్ రన్ వీడియో..