Reading Time: 2 minutes

అడవి బిడ్డలకు ఆతిథ్య శిక్షణ  కుకింగ్, హౌస్  కీపింగ్, గెస్ట్  రిలేషన్స్‌‌‌‌‌‌‌‌పై స్పెషల్  క్లాసులు

Caption of Image.
  •     ఎకో టూరిజం కేంద్రాల్లో కార్పొరేట్  స్థాయి సర్వీసులు
  •     7 జిల్లాల నుంచి 31 మందికి నిథ‌‌‌‌‌‌‌‌మ్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ
  •     కుకింగ్, హౌస్  కీపింగ్, గెస్ట్  రిలేషన్స్‌‌‌‌‌‌‌‌పై స్పెషల్  క్లాసులు
  •     నిర్మాణ్  సంస్థ, డెక్కన్  ట్రైల్స్  సహకారంతో కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడవి బిడ్డలకు సొంత గడ్డపై ఉపాధి కల్పించడంతో పాటు ఎకో టూరిజం రూపురేఖలను మార్చేందుకు సర్కారు ప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌డ్బందీ ప్రణాళిక రూపొందించింది. అడవులను సందర్శించే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం అందించేలా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ‘నిర్మాణ్’ స్వచ్ఛంద సంస్థ, ‘డెక్కన్ ట్రైల్స్’ భాగస్వామ్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  అటవీ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వచ్చే సందర్శకులకు కార్పొరేట్  స్థాయి సేవలు అందించేలా ఆయా ప్రాంతాల యువతకు ఆతిథ్య రంగంలో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. అలాగే ఆయా టూరిజం హోటల్స్​లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

7 జిల్లాల నుంచి ఎంపిక..

రాష్ట్రంలోని ప్రధాన అటవీ ప్రాంతాలున్న 7 జిల్లాల నుంచి 31 మంది అభ్యర్థులను ఈ శిక్షణ కోసం ఎంపిక చేశారు. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు, వికారాబాద్, వరంగల్  జిల్లాలకు చెందిన యువతకు ఈ అవకాశం కల్పించారు. వీరంతా స్థానిక అటవీ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో పర్యాటకులకు అడవి గురించి వివరించడంతోపాటు వృత్తిపరమైన సేవలు అందించడం సులభతరమవుతుంద‌‌‌‌‌‌‌‌ని ఆఫీస‌‌‌‌‌‌‌‌ర్లు భావిస్తున్నారు. వీరికి గచ్చిబౌలిలోని ప్రతిష్టాత్మక ‘నేషనల్  ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్  ఆఫ్  టూరిజం అండ్  హాస్పిటాలిటీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్(నిథ‌‌‌‌‌‌‌‌మ్‌‌‌‌‌‌‌‌)’లో ఈ నెల 8 నుంచి  శిక్షణ ప్రారంభమైంది. 22తేదీ వరకు వివిధ అంశాలపై శిక్షణ  కొన‌‌‌‌‌‌‌‌సాగ‌‌‌‌‌‌‌‌తుంది. హోటల్  మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్  రంగంలో నిష్ణాతులైన వారితో వీరికి కుకింగ్, ఫ్రంట్  ఆఫీస్  మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, హౌస్  కీపింగ్, ఫుడ్  అండ్  బెవరేజ్  సర్వీస్, సాఫ్ట్  స్కిల్స్, పర్సనల్  గ్రూమింగ్  త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌ర అంశాల‌‌‌‌‌‌‌‌పై క్లాసులు నిర్వహిస్తున్నారు. పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా రుచికరమైన, శుభ్రమైన ఆహారాన్ని ఎలా తయారు చేయాలి?, రిసార్ట్‌‌‌‌‌‌‌‌కు వచ్చే పర్యాటకులను ఎలా రిసీవ్ చేసుకోవాలి? వారితో ఎలా మాట్లాడాలి?, రిసార్ట్  గదులను శుభ్రంగా, ఆకర్షణీయంగా ఎలా ఉంచాలి?, అతిథులకు భోజనం వడ్డించే పద్ధతుల‌‌‌‌‌‌‌‌పై ట్రైనింగ్  ఇస్తున్నారు. కేవలం పనులు చేయడమే కాకుండా, పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేందుకు అవసరమైన ‘సాఫ్ట్  స్కిల్స్’పై స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్లు నిథమ్​ డైరెక్టర్​ వెంకటరమణ తెలిపారు. పర్సనల్  గ్రూమింగ్(వేషధారణ), పర్సనల్  హైజీన్(వ్యక్తిగత పరిశుభ్రత), అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, అతిథులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్  మీడియాను ఉపయోగించి పర్యాటక కేంద్రాలను ఎలా ప్రమోట్  చేయాలి. ఆన్​లైన్  బుకింగ్స్  ఎలా హ్యాండిల్  చేయాలనే విషయాలను కూడా నేర్పిస్తున్నామన్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, యూట్యూబ్  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ల ద్వారా అడవి అందాలను ప్రమోట్  చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందుతున్న యువతకు కూడా వీటిని ఎలా చేయాలో నేర్పిస్తున్నామని, వీరికి ఇంగ్లీష్, హిందీ వంటి భాషల్లో కమ్యూనికేషన్  స్కిల్స్  పెంచేలా కార్యాచరణ రూపొందించామన్నారు. 

స్థానికులకు ఉపాధి.. పర్యాటకానికి ఊతం

రాష్ట్రంలోని అడవుల్లో ఎకో టూరిజాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీజీఎఫ్​డీసీ ఈ నిర్ణయం తీసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న యువత తమ స్వగ్రామాల సమీపంలోని  ఎకో టూరిజం ప్రాజెక్టుల్లో, రిసార్టుల్లో సేవలు అందిస్తారు. దీనివల్ల పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అడవుల సంరక్షణలోనూ ఈ అడవి బిడ్డల భాగస్వామ్యం పెరగనుందని టీజీఎఫ్‌‌‌‌‌‌‌‌డీసీ భావిస్తోంది. అయితే, గతంలో పర్యాటకం అంటే పెద్ద పెద్ద హోటళ్లు, ప్రైవేట్​ రిసార్టులే కనిపించేవి. కానీ, ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్  టూరిజం ఊపందుకుంటోంది. పర్యాటక కేంద్రాల వద్ద క్యాంటీన్లు, గైడ్  సర్వీసులు, వాహన సౌకర్యాలను స్థానిక గిరిజన యువత, మహిళా సంఘాలకే అప్పగిస్తున్నారు. పర్యాటకులు గిరిజన గూడేల్లోనే ఉండి, వారి ఆహారపు అలవాట్లను, సంస్కృతిని తెలుసుకునేలా హోమ్  స్టేలను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా ఆదాయం నేరుగా గ్రామస్తులకే చేరుతుంది. ఎకో- టూరిజం కేంద్రాలకు వచ్చే పర్యాటకులు కేవలం ప్రకృతిని చూడడమే కాకుండా, అక్కడి స్వచ్ఛమైన ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్లాన్  చేస్తున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.