
సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ..తొలిసారి ఢిల్లీలో ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించి అధికార పార్టీలో గుబులు పుట్టించిన విషయం తెలిసిందే. దేశం నలుమూలలనుంచి యువత, విద్యార్థుల భారీ ఎత్తున ఢిల్లీకి వచ్చి నిరసన తెలిపారు. విద్యావ్యవస్థలో లోపాలు, నీట్ పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మరోసారి ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ.. శనివారం (జూన్ 20) ఢిల్లీలోని జంతర్ మంతర్ లో మధ్యాహ్నం భారీ ర్యాలీ, నిరసన తెలుపనున్నారు. అయితే ఈసారి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది బొద్దింకల పార్టీ. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ప్రధాని మోదీ రిజైన్ చేయాలని నినాదాలు, #inflation ,#unemployment హ్యాష్ ట్యాగ్ లను షేర్ చేశారు.
ఇదిలా ఉంటే శనివారం (జూన్ 20, 2026) జంతర్ మంతర్ లో బొద్దింక జనతా పార్టీ తమ రెండవ నిరసనను చేపడుతున్న క్రమంలో దేశ రాజధాని అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా బందోబస్తును మోహరించారు. పోలీసుల నిఘా, ర్యాలీ నియంత్రణ చర్యలు చేపడుతున్నాట్లు అధికారులు తెలిపారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలు ,పొరుగు రాష్ట్రాల నుంచి సీజేపీ సపోర్టర్లు తరలివస్తున్నారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది.
సీజేపీ ఢిల్లీ నిరసన..ప్లేట్లు, స్పూన్లు తీసుకురావాలని సపోర్టర్లకు పిలుపు
ర్యాలీకి ముందు కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ ప్లేట్లు కొట్టాలని చేసిన పిలుపును పోలుస్తూ.. శనివారం జరిగే సీజేపీ ర్యాలీకి థాలి(పళ్లెం), చమాచ్(చెంచా) తో రావాలని ఫౌండర్ అభిజిత్ దీప్కే మద్దతుదారులకు పిలుపునిచ్చారు.