Reading Time: 2 minutes
Ys Jagan Alleges Rule Of Fear In Andhra Pradesh Targets Tdp Government

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రాష్ట్రంలో ప్రజలు న్యాయం కోసం కాకుండా పోలీసులకే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గాదె సాయికృష్ణ కస్టడీ మరణం రాష్ట్రాన్ని కలవరపెడుతోందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారంటూ ఆరోపించారు. అలాగే పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా ప్రస్తావించారు.

‘రెడ్ బుక్ పాలన’పై తీవ్ర విమర్శలు

టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్ పాలన’ వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ ఆరోపించారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా, లేక రెడ్ బుక్ ప్రకారమా పనిచేస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తారు. రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారుతున్నారని విమర్శించారు. ఇక, తునిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి, కర్నూలు జిల్లా గంగమ్మ ఘటనలను ప్రస్తావిస్తూ పోలీసు వేధింపుల ఆరోపణలతో వరుసగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కాదని, పోలీసు వ్యవస్థలో ప్రమాదకర ధోరణికి సంకేతమని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్

రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులకు బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగాలని, పోలీసులు ప్రజల హక్కులను కాపాడే వ్యవస్థగా ఉండాలని అన్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టం స్థానంలో అధికారం వస్తే ప్రజాస్వామ్యమే బలైపోతుందని హెచ్చరించారు. అయితే, ఏపీలో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. సాయికృష్ణ కస్టడీ మరణం, క్రాంతి కుమార్ ఆత్మహత్య వంటి ఘటనలు ఒక్కో సంఘటన మాత్రమే కాదని, రాష్ట్రంలో పెరుగుతున్న పోలీసు వేధింపుల సంస్కృతికి ఇవి నిదర్శనాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..