Reading Time: 2 minutes

ఉపవాసం అయిపోయాక ఫ్రూటీ తాగితే ప్రాణం పోవడం ఏంటయ్యా..?

Caption of Image.

ఫరీదాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపవాసం అయిపోయాక ఫ్రూటీ తాగిన వ్యక్తి కొద్దిసేపటికే వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తి పేరు అంకుష్. వయసు 33 సంవత్సరాలు. మృతుడిని అంకుష్‌గా గుర్తించినట్లు సమాచారం.

గురువారం రాత్రి హనుమాన్ నగర్ ప్రాంతంలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేశాడు. దీక్ష అయిపోయాక ఫ్రూటీ తాగాడు. అది తాగిన వెంటనే అతనికి వాంతులు మొదలయ్యాయి. తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని బాధపడ్డాడు. ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.

కుటుంబ సభ్యులు అంకుష్ను దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి మరింత విషమించడంతో అక్కడి వైద్యులు అతడిని ఫరీదాబాద్‌లోని బాద్షా ఖాన్ సివిల్ ఆసుపత్రికి పంపించారు. ఆ సివిల్ ఆసుపత్రిలో కూడా.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపించాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. అంకుష్ పరిస్థితి మరింత విషమించి మార్గమధ్యంలోనే చనిపోయాడు.

ఖేడి పుల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దేవేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఒక వ్యక్తి మృతదేహాన్ని సర్వోదయ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. విచారణ సమయంలో.. అంకుష్ ఉపవాసం చేస్తున్నాడని, తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి ముందు ఉపవాసం విరమించడానికి ఫ్రూటీ డ్రింక్ తాగాడని అతని కుటుంబ సభ్యులు తమకు తెలిపారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.