Reading Time: < 1 minute
Self Styled Godman Arrested For Years Of Abuse And Sexual Exploitation Of Woman

మహారాష్ట్రలోని పుణేలో ఒక స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు (గాడ్‌మ్యాన్) చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రాధామోహన్ మిశ్రా అనే వ్యక్తి తనకు దైవిక శక్తులు ఉన్నాయని నమ్మించి, ఓ మహిళను దాదాపు 15 సంవత్సరాల పాటు లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అతనితో పాటు ఏడుగురు సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆరోగ్య, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికి ఆమెను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, విద్యుత్ షాక్‌లు ఇవ్వడం, తన మూత్రం తాగాలని బలవంతం చేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, మహిళను తన భర్తకు దూరం చేయడం, ఆస్తులను తన పేరుకు బదిలీ చేయించాలని ఒత్తిడి చేయడం, కుటుంబ సభ్యుల నుంచి వేరుచేసి పూర్తిగా తన నియంత్రణలో ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆశ్రమంలో సీసీటీవీ నిఘా, కఠిన నియంత్రణ వ్యవస్థల ద్వారా ఆమెపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.

చివరకు మహిళ ఆశ్రమం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆశ్రమంలో సోదాలు నిర్వహించి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.