Reading Time: 2 minutes

ప్రియుడితో ఉన్నప్పుడు లేచి ఏడుస్తున్నాడంట.. రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

Caption of Image.

ఏం తల్లిరా బాబూ ఇదీ.. మనుషులు ఏంట్రా బాబూ ఇలా తయారు అవుతున్నారు.. ముందూ వెనక సోయి ఉండటం లేదా.. ఏం చేస్తున్నామో అర్థం కావటం లేదా వీళ్లకి అనేంతగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సిటీ శివార్లలోని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండేళ్ల చిన్నారి మరణం వెనక మర్డర్ మిస్టరీ ఉందని బయటకు రావటంతో జనం అంతా నోరెళ్లబెట్టారు.. కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో హిడెన్ గార్డెన్స్ ఏరియాలో స్వామి, జ్యోతి నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు, ఒక పాప. భర్త స్వామి క్యాబ్ డ్రైవర్. పెళ్లయిన కొత్తలో.. సొంతూరు తీగుళ్లల్లో జ్యోతికి నవీన్ అనే కుర్రోడు పరిచయం అయ్యాడు.  పెళ్లయిన కొత్తలో నవీన్ తో ఏర్పడిన పరిచయం.. ఇప్పటికీ కొనసాగుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్లిద్దరూ కలుస్తూనే ఉన్నారు. ఈ విషయం భర్తకు తెలియకుండా చాలా రహస్యంగా ఉంచింది. 

ఈ క్రమంలోనే 2026, మే 29వ తేదీన భర్త స్వామి తన క్యాబ్ డ్రైవర్ డ్యూటీకి వెళ్లాడు. ఆ సమయంలో జ్యోతిని కలవటానికి ఇంటికి వచ్చాడు నవీన్. వీళ్లిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెండేళ్ల కొడుకు తరచూ నిద్ర లేచి ఏడుస్తున్నాడు. పదే పదే నిద్ర లేని ఏడుస్తుండటంతో.. కోపంతో ఆ రెండేళ్ల కొడుకును తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు చిన్నారి చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఇక్కడే డ్రామా ప్లే చేసింది జ్యోతి.

పిల్లోడు మంచంపై నిద్రపోతూ దొర్లి కింద పడ్డాడని.. నోటి మాట రావటం లేదంటూ తన ప్రియుడు నవీన్ తో కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లింది జ్యోతి. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. ఇది నిజమే అనుకుని భర్త స్వామి తన కొడుకు అంత్యక్రియలను సొంతూరు తీగుళ్ల గ్రామంలో నిర్వహించాడు. 

భార్య జ్యోతి ప్రవర్తనలో మార్పు రావటం.. వ్యవహార శైలిని అనుమానించిన భర్త స్వామి.. తన ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాడు. కాలనీలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ చూశాడు. భార్య జ్యోతి, నవీన్ కలిసి ఉండటం, తిరగటం కనిపించింది. అనుమానం వచ్చి కీసర పోలీసులకు కంప్లయింట్ చేశాడు. జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. కొట్టటం వల్లే తన కొడుకు చనిపోయినట్లు ఒప్పుకుంది. దీంతో తీగుళ్లల్లో రెండేళ్ల చిన్నారి డెడ్ బాడీని బయటకు తీసి.. పోస్టుమార్టం నిర్వహించారు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి డాక్టర్లు. రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. 

విషయం బయటకు రావటంతో నవీన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటం.. ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు పిల్లోడు అల్లరి చేయటం వల్లే చంపినట్లు చెబుతున్నారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.