
మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాల హిడెన్ గార్డెన్లో రెండు ఏళ్ల పిల్లాడిని కన్న తల్లి చంపిన ఘటన స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. గత కొన్ని నెలలుగా చీర్యాల్ హిడెన్ గార్డెన్లో నివాసం ఉంటున్న జ్యోతి, స్వామి దంపతులు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. జ్యోతి భర్త స్వామి వృతి రీత్యా క్యాబ్ డ్రైవర్. ఉదయం వెళ్ళి రాత్రికి వెళ్తుండేవాడు.
జ్యోతి అత్త గారి ఇల్లు తీగుల్. అక్కడే పెళ్లి అయిన కొత్తలో జ్యోతికి నవీన్ పరిచయం అయ్యాడు. పెళ్లి అయిన నాటి నుంచి నేటి వరకు అతనితో భర్తకు తెలియకుండా జ్యోతి సంబంధం కొనసాగించింది. మే 29 వ తేదీన జ్యోతి, నవీన్ ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో పడుకొని లేచిన జ్యోతి రెండేళ్ల కొడుకు తరచూ ఏడుస్తున్నాడు. ఏడుపు ఎంతకీ ఆపకపోవడంతో జ్యోతి, నవీన్తో కలిసి కన్న కొడుకును కొట్టి చంపేసింది.
పిల్లాడు బెడ్ మీద నుంచి కింద పడిపోయాడని, నోటి మాటలు రావడం లేదని నవీన్తో కలిసి పిల్లాడిని జ్యోతి హాస్పిటల్కి తీసుకెళ్లింది. పిల్లాడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. భార్య చెప్పిన విషయం నిజమని నమ్మిన జ్యోతి భర్త స్వామి స్వస్థలం తీగుల్కి పిల్లాడి డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాడు. భార్య తీరుపై అనుమానం వచ్చిన భర్త కాలనీలో సీసీ కెమెరాలు పరిశీలించి భార్యపై కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసుల విచారణలో జ్యోతి తన ప్రియుడు నవీన్తో కలిసి పిల్లాడిని కొట్టడంతో చనిపోయాడని ఒప్పుకుంది. శుక్రవారం తీగుల్ గ్రామంలో గాంధీ హాస్పిటల్ డాక్టర్స్, రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి రీ పోస్టు మార్టం నిర్వహించారు. ప్రస్తుతం నవీన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.