Reading Time: < 1 minute
Godavari Suicide Case Apsp Constable Vamsis Body Recovered Harassment Allegations Under Probe

Godavari Suicide Case: రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో గోదావరి నదిలో వంశీ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన చంద్రమల్ల వంశీగా గుర్తించారు. ఆయన కాకినాడలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సమయంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఓ మహిళా కానిస్టేబుల్ వేధింపుల కారణంగా వంశీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వంశీ తండ్రి ఆరోపించారు. అలాగే వంశీకి మరో యువతితో త్వరలో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఈ ఘటన జరగడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. తన కుమారుడు మానసిక వేధనల కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని వంశీ తండ్రి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఘటనకు గల అసలు కారణాలపై పూర్తి స్థాయి విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై రాజమండ్రి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వంశీ కాల్ డేటా, మెసేజెస్, వాట్సఫ్ చెక్ చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.