
llu Arjun’s Special Look Test for AA23: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాత్కాలికంగా ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు రావడంతో బన్నీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం AA23 సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రత్యేక లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు సమాచారం. జూన్ 25న ముంబైలో ఈ లుక్ టెస్ట్ జరగనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ టెస్ట్ ద్వారా సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతోంది?, లోకేష్ కనగరాజ్ తనదైన స్టైల్‌లో అల్లు అర్జున్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నాడు? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పాత్రకు సంబంధించిన మేకోవర్, స్టైలింగ్, క్యారెక్టర్ డిజైన్ వంటి కీలక అంశాలను కూడా ఈ దశలో ఫైనలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే విధంగా ఈ పాత్రను డిజైన్ చేస్తున్నారని సమాచారం. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో కనిపించే పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్టుగానే బన్నీ పాత్ర కూడా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. లుక్ టెస్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన అనంతరం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్ 2026 నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారనే ప్రచారం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌పై బన్నీ పూర్తి దృష్టి సారించనున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ కాంబినేషన్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.