Reading Time: 2 minutes
Trump Iran No Money Switzerland Talks Delayed Lebanon Conflict Hormuz Crisis

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగబోతున్నాయా? మళ్లీ బాంబు దాడులు జరగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎవరూ కూడా తగ్గదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు హెచ్చరికలు ఇచ్చుకుంటున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం (MoU) సంతకాల కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో నిరాశతో కాదు.. అవసరంతోనే చర్చలకు వచ్చిందని పేర్కొంటూ.. “ఇరాన్ పూర్తిగా ముగిసిపోయింది. మేము 60 రోజుల ఒప్పంద కాలాన్ని గౌరవిస్తాం. కానీ వారికి ఒక్క పైసా కూడా ఇవ్వం.. పది సెంట్లు కూడా కాదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంలోని మొజ్తబా చేసిన “అమెరికా నిరాశతో చర్చలకు వచ్చింది” అనే వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన ట్రంప్.. అమెరికా ఎప్పుడూ బలహీన స్థితిలో చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఇరాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, ప్రస్తుతం ఆ దేశం సైనికంగా తీవ్రంగా బలహీనపడిందని అన్నారు.

ఇక అమెరికాలోని డెమోక్రాట్లపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. “యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పుడు వారికి వైమానిక దళం లేదు.. నౌకాదళం లేదు.. రాడార్ వ్యవస్థలు లేవు.. వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా దాదాపు లేవు. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం కంటే ఇప్పుడు ఇరాన్ బలంగా ఉందని డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో ఆశ్చర్యంగా ఉంది” అని అన్నారు.

లెబనాన్ ఉద్రిక్తతలతో వాయిదా

ఇక అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన తదుపరి చర్చలు కూడా వాయిదా పడ్డాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య మళ్లీ తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇరాన్ అధికారులు లెబనాన్‌లో యుద్ధం ఆగిన తర్వాతే చర్చలు జరగాలని స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో అత్యంత క్లిష్టమైన అంశంగా లెబనాన్ సంక్షోభం మారింది. ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఈ ఒప్పందంలో భాగస్వాములు కాకపోయినా.. వారి మధ్య యుద్ధం ముగియడం ఒప్పంద విజయానికి కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ మద్దతుతో పనిచేసే హిజ్బుల్లా లెబనాన్‌లో కీలక శక్తిగా ఉండటంతో.. ఆ దేశ ప్రయోజనాల కోసం అవసరమైతే మళ్లీ ప్రాంతీయ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.