Reading Time: 3 minutes

తెలంగాణలో.. కర్ణాటక సాగుపద్ధతి.. వ్యవసాయం.. లాభదాయక వ్యాపారం..!

Caption of Image.

ఒకప్పుడు వ్యవసాయం అంటే వర్షాలపై ఆధారపడే జీవనాధారం. ఇప్పుడు అదే వ్యవసాయం పెట్టుబడి, ప్రణాళిక, సాంకేతికత, మార్కెటింగ్‌‌తో కూడిన లాభదాయక వ్యాపారంగా మారుతోంది. కర్ణాటక రైతులు అనుసరిస్తున్న పారిశ్రామిక వ్యవసాయ నమూనా తెలంగాణ రైతులను ఆకర్షిస్తోంది. పంట ఎంపిక నుంచి ఎగుమతుల వరకు ప్రతి దశను వ్యాపార దృక్పథంతో నిర్వహిస్తూ రైతులు అగ్రి బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు.

కర్ణాటక రైతులు అవలంబించిన  నూతన వ్యవసాయ నమూనా తెలంగాణలోనూ క్రమంగా విస్తరిస్తోంది. వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చే దిశగా తెలంగాణ పండ్ల రైతులు అడుగులు వేస్తున్నారు. సాంప్రదాయ పంటల సాగుకు పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, ఆధునిక యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్‌‌హౌస్‌‌లు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లను వాడడం వంటి అంశాల్లో కర్ణాటక రైతుల నమూనాను తెలంగాణ రైతులు అనుసరిస్తున్నారు.

ఏ ఏ జిల్లాల్లో అంటే…

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని రైతులు వ్యవసాయాన్ని పరిశ్రమ తరహాలో నిర్వహిస్తూ ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మామిడి, దానిమ్మ, కూరగాయలు, పూలు, పండ్ల తోటలు, విత్తనోత్పత్తి వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి రైతులు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. 

లాభసాటిగా పండ్ల సాగు 

కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల రైతులు అనుసరిస్తున్న పారిశ్రామిక లేదా వాణిజ్య వ్యవసాయ పద్ధతులు తెలంగాణ రైతులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొంతమంది రైతులు ఈ విధానాలను అవలంబిస్తున్నారని ఉద్యాన శాఖ అధికారులు చెప్పారు. 

భారీస్థాయిలో ఒకే పంటను వాణిజ్యపరంగా సాగు చేయడం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులు అవలంభించడం, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని నిర్ణయించారు. మార్కెట్ డిమాండ్‌‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం, వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో నిర్వహించడం, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లతో అనుసంధానం చేయడం ద్వారా పండ్ల సాగును లాభసాటిగా మార్చవచ్చని ఉద్యానశాఖ మాజీ కమిషనర్ ఎల్ వెంకట్రాంరెడ్డి వివరించారు. 

అధునాతన వ్యవసాయ పద్ధతులు 

కర్ణాటక రైతులు దిగుబడి, విలువను గరిష్ఠ స్థాయికి పెంచుకోవడానికి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, కచ్చితమైన నీటిపారుదల వంటి వాటిని వినియోగించుకుంటూ, పారిశ్రామిక తరహా వ్యవసాయాన్ని  అవలంబిస్తున్నారు. ఎరువులు, నీరు, పురుగుమందుల వాడకాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి స్మార్ట్ ఇరిగేషన్, శాటిలైట్ ఆధారిత సెన్సర్లను వినియోగిస్తున్నారు. పొలంలో పండించే పంటలు, ఉద్యానవనం, పశువులను  కలిపి, సుస్థిరమైన, క్లస్టర్ ఆధారిత జీవనోపాధిని విస్తరిస్తున్నారు. 

ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, బిందు సేద్య వ్యవస్థలు, వ్యవసాయ యంత్రాలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల శ్రమ ఖర్చులు తగ్గి, సామర్థ్యం మెరుగుపడుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర, బాగల్‌‌కోట్, కోలార్ వంటి జిల్లాలు వాణిజ్య ఉద్యానవనానికి, ఎగుమతి నాణ్యత గల ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందాయి.

పాలమూరులో పైలెట్ ప్రాజెక్ట్

నేషనల్ హార్టికల్చర్ డెవలప్ మెంట్ బోర్డు క్లస్టర్ డెవలప్​మెంట్ ప్రోగ్రాం కింద తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్లస్టరును ఎంపిక చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో మామిడితోటలుఅభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దేశంలో నేషనల్ హార్టికల్చర్ బోర్డు11 రాష్ట్రాల్లోని12 జిల్లాల్లో ఏడు పంటల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ క్లస్టర్ కింద 30 ఏళ్ల క్రితం వేసిన మామిడి తోటల్లో ఫ్రూనింగ్ చేయడం, అధునాతన సాగు యాజమాన్య పద్ధతులు అవలంబించేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మహబూబ్ నగర్ ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె వేణుగోపాల్ చెప్పారు. ఒక్కో క్లస్టరుకు రూ.62.5 కోట్లను కేంద్రం కేటాయించిందని ఆయన తెలిపారు.

 కొత్తగా అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో మామిడి తోటలు వేయడంతోపాటు రైతులు పండిస్తున్న మామిడికి బ్యాగింగ్ చేసేందుకు వీలుగా కవర్లను పంపిణీ చేయడం, అధునాతన సాగు పద్ధతులు అవలంబించడం ద్వారా నాణ్యమైన మామిడి దిగుబడిని పెంచాలని, తద్వారా విదేశాలకు ఎగుమతులను 25 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మామిడి ఎగుమతి ద్వారా రైతుల ఆదాయం పెంచాలని నిర్ణయించారు. 

రూ.200 కోట్లతో ప్రాజెక్టు

మహబూబ్ నగర్ జిల్లాలో ఏడాదికి రెండు వేలమంది మామిడి రైతులకు లబ్ధి చేకూరేలా క్లస్టర్ డెవలప్​మెంట్ ప్రోగ్రాం కింద రూ.200 కోట్లతో ప్రాజెక్టును నేషనల్ హార్టికల్చర్ డెవలప్ మెంట్ బోర్డు చేపట్టింది. వచ్చే మూడేళ్లలో 6వేలమంది మామిడి రైతులకు ప్రయోజనం కల్పించేలా క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని  రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ బి బాబు వెల్లడించారు.

 పాలమూరు రైతులు పండించిన మామిడిని1.50 మెట్రిక్ టన్నులను కేవలం నామమాత్రంగా రూపాయి ఖర్చుతో ఢిల్లీలోని మార్కెట్లకు కిసాన్ రైల్ ద్వారా చేరవేయాలని కేంద్రం నిర్ణయించింది. జిల్లాలోని15వేల హెక్టార్లలో మామిడి క్లస్టరును అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లను కేంద్రం విడుదల చేసింది. మామిడి తోటల సాగుకు రూ.79.89 లక్షలు, సాగులో మేలైన పద్ధతులను అవలంబించడానికి రూ.80.70 లక్షలు, మామిడి పండ్ల రవాణా, మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం రూ.39.80 లక్షలను కేటాయించారు. 

రూ.200కోట్లతో అమలు చేస్తున్న ఈ క్లస్టర్ అభివృద్ధి పథకం కింద జాతీయ హార్టికల్చర్ బోర్డు సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఈ పథకం అమలు కోసం 8 కమిటీలను కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వేశారు. 
సాంకేతికత, మార్కెట్ అనుసంధానం, ప్రాసెసింగ్, ఎగుమతులు, క్లస్టర్ అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేస్తూ తెలంగాణ రైతులు వ్యవసాయానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. 

కర్ణాటక నమూనా స్ఫూర్తితో సాగుతున్న ఈ మార్పు కేవలం దిగుబడులను మాత్రమే కాకుండా రైతుల ఆదాయాలను కూడా పెంచుతోంది. సంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక అగ్రి బిజినెస్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తుండటం రాష్ట్ర వ్యవసాయ రంగ భవిష్యత్తుకు శుభసూచకంగా మారుతోంది. పాలమూరులో మామిడి క్లస్టర్ వంటి ప్రాజెక్టులు విజయవంతమైతే, తెలంగాణ దేశంలోనే ఉద్యాన, వాణిజ్య వ్యవసాయానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిచే అవకాశం ఉంది.

తెలంగాణ రైతులకు కొత్త దిశ

వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతులతో నిర్వహించడం, ఖర్చు-లాభాల లెక్కలు వేసుకోవడం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, నేరుగా మార్కెట్లతో అనుసంధానం కావడం వంటి అంశాలు ఈ మార్పుకు బాటలు వేస్తున్నాయి. దీంతో తెలంగాణలో వ్యవసాయం సంప్రదాయ వృత్తి నుంచి ఆధునిక అగ్రి-బిజినెస్‌‌గా రూపాంతరం చెందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘‘పొలం నుంచి మార్కెట్ వరకు ప్రతి దశను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ, వ్యవసాయాన్ని పరిశ్రమలా నడిపించే కర్ణాటక నమూనా తెలంగాణ రైతులకు కొత్త దిశను చూపుతోంది” అని తెలంగాణ ఉద్యానశాఖ మాజీ కమిషనర్ ఎల్ వెంకట్రాంరెడ్డి చెప్పారు. 

 

©️ VIL Media Pvt Ltd.