Reading Time: 2 minutes
Police Belt: పోలీసు అధికారులు భుజానికి అడ్డంగా బెల్ట్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

కవాతులు (పరేడ్స్), సన్మాన సభలు లేదా ఏదైనా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే పోలీసు ఉన్నతాధికారుల దుస్తులలో ఈ క్రాస్ బెల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. నడుముకు పెట్టుకునే బెల్ట్‌కు అనుసంధానంగా ఉంటూ, ఒక భుజం మీదుగా ఏటవాలుగా వెళ్లే ఈ సాధనం అధికారుల గంభీర రూపానికి మరింత అదనపు గుర్తింపును ఇస్తుంది. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో ఆయుధాలు , పరికరాలు మారినప్పటికీ, ఈ రోజుకీ పోలీసు దళాలు ఈ బెల్ట్‌ను ఎందుకు వాడుతున్నాయో తెలుసుకుందాం.

క్రాస్ బెల్ట్ అంటే ఏమిటి?
క్రాస్ బెల్ట్ అనేది చర్మంతో (లెదర్) తయారు చేసినది. ఇది అధికారి నడుము బెల్టుకు జత చేసి ఉంటుంది. ఒక భుజం మీదుగా అడ్డంగా వెళ్లడం వల్ల అధికారి శరీరంపై ఆయుధాల బరువు సమానంగా పడుతుంది. అంతేకాకుండా, విధి నిర్వహణలో అవసరమయ్యే ఇతర చిన్న చిన్న పరికరాలను నడుము బెల్టుకు సులభంగా తగిలించుకోవడానికి ఇది ఒక సపోర్ట్‌లా పనిచేస్తుంది.

ఈ బెల్ట్ వెనుక ఉన్న సుదీర్ఘ చరిత్ర
ఈ బెల్ట్ వాడకం మన దేశంలో బ్రిటీష్ పాలన కాలం నుండి ప్రారంభమైంది. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసిన జనరల్ సామ్ బ్రౌన్ అనే ఒక అధికారి పేరు మీదుగానే దీనికి ‘సామ్ బ్రౌన్ బెల్ట్’ అనే పేరు వచ్చింది. ఒక యుద్ధంలో సామ్ బ్రౌన్ ఎడమ చేయి తీవ్రంగా గాయపడింది. ఆ కాలంలో సైనికులు తమ కత్తిని ఒర నుండి బయటకు తీయాలంటే ఎడమ చేత్తో ఒరను గట్టిగా పట్టుకుని, కుడి చేత్తో కత్తిని లాగాల్సి వచ్చేది. ఒక చేయి పూర్తిగా దెబ్బతినడం వల్ల సామ్ బ్రౌన్‌కు ఒక్క చేత్తో కత్తిని తీయడం చాలా కష్టంగా మారింది.

ఈ సమస్యను అధిగమించడానికి ఆయన ఒక అద్భుతమైన మార్గాన్ని ఆలోచించారు. నడుము బెల్టుకు మద్దతుగా భుజం నుండి అడ్డంగా వచ్చేలా ఒక అదనపు బెల్టును డిజైన్ చేసుకున్నారు. ఈ కొత్త డిజైన్ వల్ల కత్తి ఒర కదలకుండా ఒకే చోట స్థిరంగా నిలిచింది. ఫలితంగా ఆయన కేవలం తన కుడి చేత్తోనే ఎంతో సులభంగా, వేగంగా కత్తిని బయటకు తీయగలిగారు.

సైన్యం నుండి పోలీసు దళాల వరకు
సామ్ బ్రౌన్ కనిపెట్టిన ఈ ఐడియా బ్రిటీష్ సైన్యంలోని ఇతర అధికారులకు కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కత్తి బరువును భుజంపైకి మార్చి నడుముపై ఒత్తిడిని తగ్గించింది. దాంతో బ్రిటీష్ సైన్యం దీనిని తమ అధికారిక యూనిఫాంలో భాగంగా మార్చింది. కాలక్రమేణా సైన్యంతో పాటు పోలీసు దళాలు, కేంద్ర పారామిలిటరీ దళాలు కూడా ఈ బెల్టును వాడటం ప్రారంభించాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన దేశ పోలీసు వ్యవస్థలో ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతోంది.

ఈ రోజుల్లో దీని ప్రాధాన్యత ఏంటి?
కాలం మారే కొద్దీ కత్తుల వాడకం తగ్గిపోయి ఆధునిక పిస్టల్స్, రివాల్వర్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయుధాలు తీయడానికి ఈ బెల్ట్ అంతగా అవసరం లేదు. అయినప్పటికీ, ఇప్పటికీ అనేక రాష్ట్రాల పోలీసు బలగాలు తమ పాత సంప్రదాయాన్ని, క్రమశిక్షణను గౌరవిస్తూ దీనిని ధరిస్తారు. ప్రస్తుతం ఈ క్రాస్ బెల్ట్ అనేది పోలీసుల అధికారిక గుర్తింపుకు, గౌరవానికి , వారి వృత్తిపరమైన బాధ్యతకు ఒక గొప్ప చిహ్నంగా నిలుస్తోంది.