తేనె అనగానే మనకు తీపి, ఆరోగ్యం గుర్తుకొస్తాయి. కానీ, ప్రపంచంలో తింటే మత్తు ఇచ్చే ఒక వింతైన తేనె ఉంది. అదే ‘మ్యాడ్ హనీ’ హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే దొరికే ఈ ప్రత్యేకమైన తేనె ఎరుపు రంగులో ఉంటుంది. అడవుల్లో పెరిగే రోడోడెండ్రాన్ పువ్వుల నుండి తేనెటీగలు దీనిని తయారు చేస్తాయి. సాధారణ తేనెతో పోలిస్తే ఇందులో కొన్ని సహజ కెమికల్స్ ఉంటాయి. దీనివల్ల ఈ తేనె తిన్నవారికి తల తిరగడం, మతిభ్రమించడం, ఒక రకమైన కిక్ రావడం జరుగుతుంది. ఈ వింత తేనె గురించిన ఆసక్తికర విషయాలను ముచ్చటించుకుందాం.
తరతరాల పురాతన సంప్రదాయం: మ్యాడ్ హనీ చరిత్ర ఈనాటిది కాదు, శతాబ్దాల నాటిది. నేపాల్‌లోని ‘గురుంగ్’ అనే గిరిజన జాతి ప్రజలు ఈ తేనెను సేకరించడాన్ని ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఇక పూర్వ కాలంలో దీనిని ఒక ఆయుర్వేద మందులా వాడేవారు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి ఫుల్ డిమాండ్ పెరగడంతో విదేశీ పర్యాటకులు కూడా దీని కోసం నేపాల్ పరుగెత్తుకొస్తున్నారు.
ప్రాణాలు పణంగా పెడితేనే దొరుకుతుంది: ఈ తేనెను పట్టుకోవడం అంత తేలికైన పని కాదు. వేటగాళ్లు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కొండలు ఎక్కుతారు. ఇక హిమాలయాల్లోని కాస్కీ, లామ్‌జుంగ్ లాంటి ప్రాంతాల్లోని నిలువుగా ఉండే ఎత్తైన కొండచరియలపై ఈ తేనెపట్లు ఉంటాయి. కేవలం తాళ్లు, వెదురు నిచ్చెనల సహాయంతో అంత పైకి వెళ్తారు. ఇక ఒక్క అడుగు తేడా వచ్చినా కింద పడి ప్రాణాలు పోతాయి. పైగా అక్కడి భారీ హిమాలయ తేనెటీగలు దాడి చేస్తే తట్టుకోవడం చాలా కష్టం.

కిలో ధర రూ. 10,000 పైనే: ప్రాణాల రిస్క్ ఎక్కువగా ఉండటం, చాలా అరుదుగా దొరకడం వల్ల మార్కెట్‌లో దీని ధర విపరీతంగా ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కిలో మ్యాడ్ హనీ ధర దాదాపు రూ. 10,000 వరకు పలుకుతోంది. అయినప్పటికీ, దీని కిక్ కోసం మరియు ఔషధ గుణాల కోసం పర్యాటకులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు.
మత్తు వెనుక ఉన్న అసలు సీక్రెట్: ఈ తేనెలో ‘గ్రయానోటాక్సిన్’ అనే ఒక రకమైన సహజ కెమికల్ ఉంటుంది. ఇక దీనిని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మనసు ప్రశాంతంగా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. కానీ, కొంచెం ఎక్కువ తీసుకున్నా వికారం, వాంతులు, లేనివి ఉన్నట్లు కనిపించడం (హాలూసినేషన్స్) జరుగుతాయి. కొన్నిసార్లు తాత్కాలికంగా కాళ్లు, చేతులు పడిపోయే (పక్షవాతం) ప్రమాదం కూడా ఉంది.
ఆరోగ్య ప్రయోజనాలపై నమ్మకాలు: స్థానికులు ఈ తేనెను కీళ్ల నొప్పులు తగ్గడానికి, కడుపు సమస్యల నివారణకు వాడుతుంటారు. అలాగే లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని కూడా కొందరు నమ్ముతారు. అయితే ఈ విషయాలపై సరైన సైంటిఫిక్ ఆధారాలు లేవు. ప్రస్తుతం ఘలేగావ్, ఘన్పోఖరా వంటి గ్రామాల్లో ఈ తేనెను చూసేందుకు పర్యాటకం కూడా బాగా పెరిగింది. అయితే క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు ఈ తేనెటీగల ఉనికి ప్రమాదంలో పడింది.
ప్రకృతి ప్రసాదించిన వింతల్లో ఈ మ్యాడ్ హనీ ఒకటి. కేవలం మత్తు కోసమే కాకుండా ఎంతో సాహసంతో కూడిన దీని సేకరణ విధానం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పరిమితికి మించితే అమృతం కూడా విషమే అన్నట్లు.. ఈ తేనెను కూడా చాలా జాగ్రత్తగా వాడాలి.
గమనిక: మ్యాడ్ హనీని సాధారణ తేనెలా స్పూన్ల కొద్దీ తినకూడదు. ఇందులో ఉండే టాక్సిన్స్ వల్ల ప్రాణాంతకమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి, పర్యాటకులు సరదా కోసం దీనిని కొనుగోలు చేసినా, నిపుణులు లేదా వైద్యుల పర్యవేక్షణ లేకుండా నేరుగా అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
The post ప్రాణాల మీదకు తెచ్చే తేనె! కిలో రూ.10,000 విలువైన షాకింగ్ నిజం appeared first on Manalokam – Latest Telugu News & Updates.