
- చదువుతోనే స్టైఫెండ్.. డిగ్రీతోనే కొలువు
- వందకు పైగా ప్రముఖ కంపెనీలతో సర్కారు చరిత్రాత్మక ఒప్పందాలు
- అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ కోర్సులతో మారుతున్న విద్యా వ్యవస్థ రూపురేఖలు
- పారిశ్రామిక శిక్షణ కోసం ‘సైయంట్ ఫౌండేషన్’ రూ. 7.5 కోట్ల పెట్టుబడి
- సర్కార్ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం
- 49 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొదటి ఫేజ్‌లోనే 49.6 శాతం సీట్లు భర్తీ
- హెల్త్‌కేర్, ఐటీ, టూరిజం, బ్యాంకింగ్‌లాంటి కోర్సుల్లో 70 శాతం పెరిగిన చేరికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం డిగ్రీ పట్టా అందుకోవడమే కాకుండా, చదువు పూర్తి కాగానే చేతిలో ఉద్యోగం ఉండేలా విద్యా రంగాన్ని ఉపాధి దిశగా మలుస్తోంది. ఇందులో భాగంగా 100కుపైగా దిగ్గజ పారిశ్రామిక సంస్థలు, అగ్రశ్రేణి విద్యా సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫలితంగా సర్కార్ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి అడ్మిషన్ల జోరు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీలకు డిమాండ్ కనిపిస్తున్నది. రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొదటి ఫేజ్‌లోనే 49.6% సీట్లు భర్తీ కావడమే ఇందుకు నిదర్శనం. నిరుడితో పోలిస్తే రెండో విడతలో 37 శాతం అదనపు కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఈడీపీ) కోర్సుల్లో చేసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. గత ఏడాది కేవలం 24 కాలేజీలకే పరిమితమైన ఈ ప్రోగ్రామ్‌ను.. ఈసారి 96 కాలేజీలకు విస్తరించి, సీట్లను 11వేలకు పెంచారు.
దిగ్గజ సంస్థలతో చేతులు కలిపిన సర్కారు..
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఐఐ, ఐఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌లాంటి100కు పైగా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘సైయంట్ ఫౌండేషన్’ మూడేండ్ల కాలానికి రూ. 7.5 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వ కాలేజీల్లో స్టార్టప్స్, హ్యాకథాన్‌ల నిర్వహణకు ముందుకొచ్చింది. దీనితో విద్యార్థులు చదువుకుంటూనే స్టైఫండ్ పొందే అవకాశం లభిస్తోంది.
సిలబస్ మార్పు.. టీచర్లకు ట్రైనింగ్ ..
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యాశాఖ సుమారు 180 కొత్త పేపర్లను ప్రవేశపెట్టి సిలబస్‌ను ఆధునీకరించింది. సెమీకండక్టర్లు, రోబోటిక్స్‌లాంటి రంగాల్లో 10 కొత్త కోర్సులను ప్రవేశపెట్టగా, అక్కడ 92 శాతం అడ్మిషన్లు నమోదయ్యాయి. 1,600 మందికి పైగా లెక్చరర్లకు పారిశ్రామిక అవసరాలపై అవగాహన కల్పించేందుకు 110 ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘2047 విజన్ డాక్యుమెంట్’లో భాగంగా.. భవిష్యత్తులో రాబోయే ఫార్మా హబ్, ఈవీ బ్యాటరీ వెహికల్స్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను ఇప్పుడే సిద్ధం చేస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒప్పందాలు చేసుకోగా.. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అని అధికారులు చెప్తున్నారు.
ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్.. ఎంపికైన విద్యార్థులు
మేధా సర్వో: రూ. 3.45 లక్షల ప్యాకేజీతో 66 మంది ఎంపిక
ట్రో ఇంజనీరింగ్: రూ. 2.42 లక్షల ప్యాకేజీతో 36 మందికి అవకాశం
మహీంద్రా అండ్ మహీంద్రా: 56 మందికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్
-వీటితో పాటు బ్లూ స్టార్, ఆల్ప్లా, అల్ట్రాటెక్ సిమెంట్‌లాంటి సంస్థల్లో భారీగా ఉద్యోగావకాశాలు