
అనగనగా ఒక అడవి. దాని పేరు జ్ఞానవనం. ఆ అడవిలో చిట్టి అనే చిలుక ఉండేది. మెరిసే కళ్లతో అందంగా ఉంటుంది. మంచి మనసు, చురుకైన ఆలోచనలు కలది. “నేను పెద్దవాడిని కాకపోయినా, మంచి పని చేస్తే అందరికీ ఉపయోగపడగలను” అని తనలో తాను అనుకునేది. చిట్టికి ‘బుజ్జి’ కుందేలు.. ‘మందారం’ జింక.. ‘ధీరుడు’ ఏనుగు.. స్నేహితులు.
ఒక పెద్ద వటవృక్షం మీద మేధావి గుడ్లగూబ కూడా నివసించేది. చిట్టి గుడ్లగూబను చూస్తూ.. “గురువుగారూ నిజమైన గొప్పతనం అంటే ఏమిటి?” అని అడిగింది. గుడ్లగూబ నవ్వి “ఇతరులకు ఉపయోగపడే మనసే నిజమైన గొప్పతనం” అంది ఆ మాట చిట్టికి బాగా నచ్చింది. తన హృదయంలో వెలుగై నిలిచిపోయింది. ఒక రోజు చిట్టి “మనమందరం కలిసి అడవిలో ఎవరికైనా సాయం చేద్దాం” అంది. ఆ మాట విని “అది చాలా మంచి ఆలోచన!” అన్నాయి.
మరుసటి రోజు ఒక చిన్న ఉడుత చెట్టు కింద ఏడుస్తూ కనిపించింది. “ఏమైంది?” అని చిట్టి అడిగింది. “నా గింజలు ఈ తీవ్రమైన ఎండకు ఎండి పోయాయి. వడగాలికి ఎగిరిపోయాయి” అని ఉడుత బాధగా చెప్పింది. చిట్టి తన స్నేహితులను పిలిచింది. అవన్నీ కలిసి గింజలు వెతికి.. ఏరి ఉడుతకు ఇచ్చాయి. ఉడుత ఆనందంతో.. “స్నేహం అంటే ఇదే!” అని సంతోషంగా చెట్టెక్కింది.
అక్కడికి బ్లాకీ అనే కాకి వచ్చి.. “ ఈ చిన్న చిలుక ఏమి చేస్తుంది? నేనే తెలివైనదాన్ని!” అంది అహంకారంగా. చిట్టి “తెలివి గొప్పది. కానీ దయ మరింత గొప్పది” అంది. కాకి పట్టించుకోలేదు. ఈ విషయం తనకు కాలమే నేర్పుతుంది అనుకుంది చిట్టి. ఆ రాత్రి బలమైన గాలి వచ్చింది. చెట్లు ఊగిపోయాయి. కాకి గూడు కిందపడిపోయింది.
బ్లాకీ భయంతో “ఎవరైనా నన్ను కాపాడండి!” అని గట్టిగా మొత్తుకుంది. చిట్టి వెంటనే ధీరుడిని పిలిచింది. ఏనుగు తన తొండంతో గూడు పైకి ఎత్తి చెట్టుపై ఉంచింది. బ్లాకీ సిగ్గుతో తల వంచుకుంది. “చిట్టీ! నేను నిన్ను తక్కువగా చూశాను. కానీ నువ్వు నాకు సాయం చేశావు” అంది బ్లాకీ. చిట్టి నవ్వుతూ..“స్నేహానికి అహంకారం అడ్డుకాదు’’ అంది. ఆ రోజు నుంచి బ్లాకీ కూడా మంచి పనులు చేయడం ప్రారంభించింది.
అది ఎండాకాలం కావటంతో.. అడవిలోని చిన్న చెరువు ఎండిపోవడం మొదలైంది. జంతువులన్నీ ఆందోళన చెందాయి. “ఇప్పుడు ఏం చేద్దాం?” అని బుజ్జి అడిగింది. చిట్టి ఆలోచించి “మనమందరం కలిసి కొత్త కాలువ తవ్వుదాం” అంది.
అనుకున్నదే తడువుగా.. ఏనుగు మట్టి తొలగించింది. కుందేలు చిన్న రాళ్లు తీసింది. జింక మొక్కలను తొలగించింది. చిట్టి అందరికీ మార్గనిర్దేశం చేసింది. కొన్ని గంటల్లోనే కాలువ సిద్ధమైంది. దూరంలోని వాగు నుంచి నీరు చెరువులోకి వచ్చాయి. అన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి. ఇక వనంలోని వృద్ధ తాబేలు అన్నది.. “ఒక్కరి శక్తి పరిమితం. అందరి ఐక్యత అపరిమితం” అనగానే చిట్టి నమస్కరించింది.
“ఈ మాటను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంది. ఇదిలా ఉండగా.. ఒక రోజు చిన్న జింక దారి తప్పిపోయింది. చిట్టి చెట్లపై ఎగిరి వెతికింది. బుజ్జి నేలపై పరుగెత్తింది. బ్లాకీ ఆకాశం నుంచి గమనించింది. చివరకు పిల్ల జింకను కనిపెట్టాయి. పిల్ల జింక తల్లిని చూసి పరుగెత్తి కౌగిలించుకుంది. “నా బిడ్డను కాపాడిన మీ అందరికీ ధన్యవాదాలు” అని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. కృతజ్ఞతా భావంతో.. చిట్టి మాట్లాడుతూ “ఇది మా బాధ్యత” అంది.
ఇలా ఉండగా.. ఒకసారి చిట్టికి ఒక బంగారు గింజ దొరికింది. “ఇది ఎవరిదో తెలుసుకుని తిరిగి ఇవ్వాలి” అంది. అది వృద్ధ ఉడుతదని తెలిసింది. వెంటనే తనకు ఇచ్చింది. ఉడుత ఎంతగానో సంతోషించి.. ఆశీర్వదించింది.ఇదంతా చూస్తూ గుడ్లగూబ.. “నిజాయితీ మనిషిని, జంతువుని గొప్పవాడిని చేస్తుంది” అంది. చిట్టి వినయంగా తలవంచింది.
ఈ శుభ సందర్భంగా.. జ్ఞానవనంలో “స్నేహోత్సవం” జరపాలని నిర్ణయించాయి. అన్నీ తమ తమ పనులు చేసుకున్నాయి. చిట్టి కార్యక్రమాన్ని నిర్వహించింది. సభలో బ్లాకీ మాట్లాడుతూ.. “అహంకారం నన్ను ఒంటరిగా చేసింది. స్నేహం నన్ను మంచిగా మార్చింది” అంది. అన్నీ చప్పట్లు కొట్టాయి. ఇక.. చిట్టి వేదికపై నిలబడి “మనలో ఎవరూ చిన్నవారు కాదు. మంచి మనసు ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవారే” అంది. ఆ రోజు నుంచి జ్ఞానవనంలో ప్రేమ, సాయం, ఐక్యత మరింత పెరిగాయి.
– డా . కటుకోఝ్వల రమేష్ –