Reading Time: 2 minutes
Sunil Gavaskar Backs Ishan Kishan For 2027 Odi World Cup After Afghanistan Century

Sunil Gavaskar: టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇషాన్ ఇప్పుడు ఒక ‘కంప్లీట్ ప్లేయర్’ (పరిపూర్ణమైన ఆటగాడు)గా మారాడని కొనియాడారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడని, ఇకపై అతడిని జట్టు నుంచి తప్పించడం సెలెక్టర్ల వల్ల కాదని గవాస్కర్ స్పష్టం చేశారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి తుఫాన్ శతకంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల క్రితం వన్డేల్లో చారిత్రాత్మక డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. ఈ తాజా మ్యాచ్‌లో మరో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా వన్డే క్రికెట్‌లో తన 1000 పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత సమకాలీన ఆటగాళ్లయిన సంజూ శాంసన్, రిషబ్ పంత్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి, రాబోయే అఫ్గానిస్తాన్ సిరీస్ వన్డే జట్టులో ఇషాన్ తన స్థానాన్ని భద్రపరుచుకున్నాడు.

ఇషాన్ కిషన్‌కు వీసా దొరికేసింది: గవాస్కర్

ఇషాన్ కిషన్ పవర్‌ఫుల్ కంబ్యాక్‌పై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నా ఉద్దేశంలో 2027 ప్రపంచకప్ కోసం అతనికి వీసా దొరికేసింది. ఇప్పుడు ఇషాన్ కిషన్‌ను జట్టు నుంచి వెనక్కి నెట్టాలంటే.. మిగిలిన ఆటగాళ్లు తమ సామర్థ్యానికి మించి అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అతను టీ20 ఫార్మాట్‌లోనూ అద్భుతమైన కాంట్రిబ్యూటర్. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు’ అని పేర్కొన్నారు. ఇక, గత ఏడాదిన్నర కాలంగా ఇషాన్ కిషన్ ఆట తీరులో వచ్చిన సాంకేతిక మార్పులను గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఇషాన్ ఆఫ్-స్టంప్ వెలుపల వచ్చే బంతులను ఆడటానికి కొంత ఇబ్బంది పడేవాడని, అయితే ఇప్పుడు ఆ బలహీనతను పూర్తిగా అధిగమించాడని చెప్పారు. గవాస్కర్ విశ్లేషణ ప్రకారం.. ‘ఇప్పుడు ఇషాన్ వద్ద అద్భుతమైన డిఫెన్స్ ఉంది. షార్ట్ పిచ్ బంతులను చాలా వేగంగా బ్యాక్‌ఫుట్‌కు వెళ్లి సిక్సర్లుగా మారుస్తున్నాడు. గతంలో అతని వద్ద లాఫ్టెడ్ ఎక్స్‌ట్రా-కవర్ డ్రైవ్ లాంటి షాట్లు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఆ షాట్లలో అతను పట్టు సాధించాడు. అందుకే అతడిని కట్టడి చేయడం బౌలర్లకు చాలా కష్టం’. అని వివరించారు.