Reading Time: 2 minutes
పిల్లలకు ఏ వయసు వరకు ట్రైన్‌లో టికెట్ అవసరం లేదు.. రైలు ఎక్కేముందు ఈ విషయాలు తెలుసుకోండి..

మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. రోజూ కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. నిత్యం రద్దీగా ఉండే రైళ్లలో పండగలు వస్తే మామూలుగా ఉండదు. దేశంలో ఎక్కడికైన కనెక్టివిటీ, తక్కుద ఛార్జీలు ఉండడమే దీనికి కారణం. పెద్దవారికి టికెట్ బుక్ చేయడంపై అందరికీ అవగాహన ఉంటుంది కానీ చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు టికెట్ తీసుకోవాలా? వద్దా? ఎంత వయసు వారికి ఉచితం? అనే విషయాలపై చాలామందికి ఎప్పుడూ గందరగోళం ఉంటుంది. ముఖ్యంగా 3 లేదా 4 ఏళ్ల పిల్లలు ఉన్నప్పుడు విడిగా టికెట్ అవసరమా? రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు అందరూ తెలుసుకోవాలి.

5 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితమేనా?

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రైలు ప్రయాణం పూర్తిగా ఉచితం. వారికి ఎలాంటి విడిగా టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అయితే వారికి విడిగా సీటు లేదా బెర్త్ కేటాయించబడదు. వారు తమ తల్లిదండ్రులతో కలిసి ఒకే సీటులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ సుదీర్ఘ ప్రయాణం కారణంగా పిల్లల కంఫర్ట్ కోసం విడిగా ప్రత్యేక సీటు కావాలని తల్లిదండ్రులు భావిస్తే, బుకింగ్ సమయంలో ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ అలా విడిగా సీటు తీసుకుంటే మాత్రం సదరు చిన్నారికి పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

5 నుండి 12 ఏళ్ల పిల్లలకు రెండు ఆప్షన్లు..

5 నుండి 12 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు రైల్వే ప్రయాణికులకు రెండు రకాల ఎంపికలను ఇస్తుంది.

ఆప్షన్ 1: ఒకవేళ మీరు మీ పిల్లల కోసం విడిగా ఎలాంటి బెర్త్ లేదా సీటు తీసుకోకుండా, మీ సీట్లోనే సర్దుకుపోతాము అనుకుంటే.. టికెట్ బుకింగ్ సమయంలో NOSB ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ సందర్భంలో సగం టికెట్ ధర మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఆప్షన్ 2: ప్రయాణం ప్రశాంతంగా, సౌకర్యవంతంగా సాగడం కోసం పిల్లల పేరిట కన్ఫర్మ్డ్ సీటు లేదా బెర్త్ కావాలనుకుంటే.. హాఫ్ టికెట్ రూల్ వర్తించదు. పెద్దవారితో సమానంగా పూర్తి టికెట్ ధరను చెల్లించి సీటు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు.

రైలులో ప్రయాణించేటప్పుడు పిల్లల వయస్సుకు సంబంధించిన వివాదాలు రాకుండా ఉండటానికి, మీ వెంట సరైన గుర్తింపు కార్డులను ఉంచుకోవడం చాలా ముఖ్యం. టీటీఈ టికెట్లను తనిఖీ చేసే సమయంలో పిల్లల ఖచ్చితమైన వయసును నిరూపించడానికి వీలుగా బర్త్ సర్టిఫికేట్ లేదా వయస్సు వివరాలు ఉన్న ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవడం మంచిది. దీనివల్ల ఎలాంటి అనవసర ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.