
ఇజ్రాయెల్-హిజ్బుల్లా శాంతి ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. హిజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. శుక్రవారం రాత్రి హిజ్బుల్లా తమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నందుకే తాము దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే లెబనాన్-ఇజ్రాయెల్ దాడులు తీవ్ర కావడంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న శాంతి ఒప్పందానికి ఇక్కట్లు వచ్చి పడ్డాయి. హార్ముజ్ జలసంధిని మూసేసినట్లుగా అధికారికంగా ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోసారి మధ్యప్రాచ్యం దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొనేటట్టు కనిపిస్తోంది.
తొలుత హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన 24 గంటలలోపే.. ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ చర్య ఇప్పుడు ఇరాన్-అమెరికాల మధ్య ఉన్న శాంతి ఒప్పందానికి ముప్పుగా పరిణమించింది . లెబనాన్ జాతీయ వార్తా సంస్థ ప్రకారం.. ఈ దాడులు దక్షిణ నగరమైన నబాటియే… దాని చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపాయి. శిథిలాల కింద కనీసం ఏడుగురు పూడిపోయారు.
హిజ్బుల్లా ప్రకటన
ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటే.. తాము కూడా అలాగే చేస్తామని హిజ్బుల్లా తెలిపింది. కానీ వాస్తవానికి ఎలాంటి కాల్పుల విరమణ అమలు జరిగిందని మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం గురించిన వార్తలు వెలువడిన తర్వాత ఇజ్రాయెల్-హిజ్బుల్లా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ఖతార్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ ప్రయత్నిస్తున్నాయని ఒక హిజ్బుల్లా అధికారి చెప్పారు. కానీ ఒప్పందం కుదిరిందని మాత్రం ధృవీకరించలేదు.