
ప్రభుత్వానికి ఒక నెల సమయం ఇస్తున్నాం.. ఈ లోగా మెడికల్ బోర్డుకు అప్లై చేసిన 1200 మంది కార్మికులను పిలిచి ఉద్యోగాలు ఇవ్వలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. లేకపోతే జూలై 20వ తేదీన ప్రత్యక్షంగా నిరహార దీక్ష చేస్తానని చెప్పారు. తెలంగాణలో కొత్తగా, కార్మికుల అండగా వచ్చిన తెలంగాణ రక్షణ సేనను మీరంతా ఆదరించాలని కోరారు.
సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన కవిత… ఉద్యమ కాలం నుంచి సింగరేణి కార్మికులతోనే నా ప్రయాణం.. వారి చెమట చుక్కల విలువ తెలిసినదానిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కనీస అవసరాలైన స్వచ్ఛమైన గాలి, మంచి నీరు కూడా లోపలికి ఇవ్వలేకపోతున్నారు. గాలి, నీళ్ల విషయంలో కూడా ఇంత కకృతి పడాలా? కార్మికులకు స్వచ్ఛమైన వసతులు కల్పించాల్సిందే. అధికారులారా.. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులకు మెమోలు జారీ చేస్తూ, విజిలెన్స్ ఎంక్వయిరీల పేరుతో వారిని ఇబ్బంది పెట్టడం మానుకోండి.
భద్రత ఎక్కడ ఉంది? మొన్న నాసిరకం డిటోనేటర్ పేలి మన కార్మికుడు గాయపడ్డాడు. సింగరేణిలో నాసిరకం పరికరాలు వాడటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి బాధ్యులెవరు? సింగరేణిలో ఏదైనా పని జరగాలంటే.. నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆఫీస్ నుంచే లంచాలు అడుగుతున్నారు. ఈ దోపిడీ నశించాలి. కార్మికుల మారుపేర్ల సమస్యలను తక్షణమే సరిచేయాలి.
ఇప్పటికైనా గెలిచిన ప్రభుత్వం, కార్మిక సంఘం స్పందించాలి. కార్మికుడు ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలి. సింగరేణికి ప్రత్యేకంగా ఒక ‘హౌసింగ్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ బోర్డు ద్వారా రిటైర్ అయిన ప్రతి కార్మికుడికి సొంతింటి కలను నిజం చేస్తాం.కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యానిదేనని చెప్పారు కవిత.