Reading Time: < 1 minute
Actor Murali Mohan 61st Wedding Anniversary Devanar Blind School Hyderabad

Murali Mohan: ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్”లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను లేదా వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకునే ఆనవాయితీని ప్రతి సంవత్సరము మురళీమోహన్ పాటిస్తుంటారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ, దేవనార్ బ్లైండ్ స్కూల్లోని అంధ విద్యార్థుల సమక్షంలో తన 61వ వివాహ దిన మహోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా స్కూలులో జరిగిన సభా కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్ పాల్గొన్నారు.

ఈ క్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ “నేను ప్రతి సంవత్సరం నా బర్త్‌డే, మ్యారేజ్ డే వేడుకలను ఇక్కడే జరుపుకుంటాను. వచ్చిన ప్రతిసారి ఈ స్కూల్ మరింత విస్తృతం అవ్వటాన్ని గమనించాను. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మన కన్నబిడ్డల్ని కూడా ఇంత ప్రేమగా చూసుకోలేమేమో.. అలాంటిది చూపులేని ఈ చిన్నారులను ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ దీన్ని ఇంతగా అభివృద్ధి చేసిన సాయిబాబా గౌడ్ కీ నా అభినందనలు. ఈ పిల్లలు భగవద్గీతను అభ్యసించి ఆలపించటం నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపిస్తుంది. అందుకే ఈ కార్యక్రమానికి భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి పిలిచిన వెంటనే వచ్చిన గంగాధర శాస్త్రికి కృతజ్ఞతలు” అన్నారు.