
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గంలో దారుణం జరిగింది. వన్ సైడ్ లవ్ పేరుతో ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. వన్ సైడ్ లవ్ పేరుతో యువతిని వెంటపడి వేధించాడు. యువతి కాదనే సరికి ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి తీవ్రంగా గాయమైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండ్ల బస్తీ ఊర పోచమ్మ ఆలయం దగ్గర ఘటన జరిగింది.
ఎండ్ల కృతిక(20) అనే యువతిని ప్రేమ పేరుతో కంచమీది గోవర్ధన్(22) అనే యువకుడు వేధించాడు. శుక్రవారం సాయంత్రం పక్కింటి బిల్డింగ్ మీద నుంచి బాధితురాలి ఇంటి రెండవ అంతస్తులోకి నిందితుడు అక్రమంగా ప్రవేశించాడు. కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. మొదట యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు.
దీనిని గమనించి అడ్డుకోబోయిన యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు, కాపాడటానికి వచ్చిన బాబాయ్పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుల కేకలతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
►ALSO READ | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నార్సింగి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో భయాందోళనలు
గాయాల పాలైన వారిని పోలీసులు హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారంతా అపాయం నుంచి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.