Reading Time: 2 minutes
FIFA World Cup 2026 : అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫుట్‌బాల్.. స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు

FIFA World Cup 2026 : క్రీడా రంగంలో సరికొత్త టెక్నాలజీని జోడించడంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే 2026 ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ మ్యాచ్ బాల్ ట్రియోండా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సరికొత్త ఫుట్‌బాల్ భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన వ్యోమగాములు స్పేస్ స్టేషన్‌లో ఈ బంతిపై ప్రత్యేకమైన భౌతికశాస్త్ర ప్రయోగాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

శూన్యంలో ఫుట్‌బాల్ బ్యాలెన్స్ పై నాసా రీసెర్చ్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న క్రూ.. శూన్య గురుత్వాకర్షణ శక్తి (మైక్రో గ్రావిటీ)లో ఫుట్‌బాల్ డైనమిక్స్, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో 2019లో చేసిన ఒక అధ్యయనాన్ని బేస్ చేసుకుని, ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ తయారు చేసిన ఈ ట్రియోండా బంతి సెంటర్ ఆఫ్ మాస్ (ద్రవ్యరాశి కేంద్రం), బ్యాలెన్స్ దాని కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను పరిశీలించారు. మైదానంలో ప్లేయర్లు కిక్ చేసినప్పుడు బంతి గాల్లో ఊహించిన విధంగా కదలాలంటే దాని బ్యాలెన్స్ ఎంత ఖచ్చితంగా ఉండాలో స్పోర్ట్స్ ఇంజనీర్లకు ఈ ప్రయోగం ద్వారా మరిన్ని లక్కీ హింట్స్ దొరికాయి.

మూడు దేశాల ఐక్యతకు ప్రతీకగా ట్రియోండా

ఈ ఫుట్‌బాల్ డిజైన్, పేరు వెనుక ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఫిఫా తెలిపిన వివరాల ప్రకారం.. ట్రియోండా అనే పదం స్పానిష్ భాష నుంచి వచ్చింది, దీని అర్థం మూడు తరంగాలు. చరిత్రలోనే మొదటిసారిగా 2026 లో మూడు దేశాలు (కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్) కలిసి సంయుక్తంగా ఈ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మూడు దేశాల ఐక్యతను చాటిచెప్పేలా బంతిపై రెడ్, గ్రీన్, బ్లూ కలర్లను ఉపయోగించారు. అంతేకాకుండా, బంతిపై కెనడాకు చెందిన మేపుల్ లీఫ్, మెక్సికోకు చెందిన ఈగిల్, అమెరికాకు చెందిన స్టార్ సింబల్స్‌ను కూడా చాలా స్టైలిష్‌గా ముద్రించారు.

బంతి లోపల హైటెక్ సెన్సార్ చిప్

ట్రియోండా బంతి కేవలం చూడటానికే కాదు, సాంకేతికంగా కూడా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా రూపొందించబడింది. ఈ బంతి లోపల 500Hz మోషన్ సెన్సార్ చిప్‎ను అమర్చారు. ఇది మ్యాచ్ జరుగుతున్నప్పుడు బంతి కదలికలకు సంబంధించిన రియల్ టైమ్ డేటాను వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) సిస్టమ్‌కు నిరంతరం పంపుతూ ఉంటుంది. దీనివల్ల గ్రౌండ్‌లో ఉండే అంపైర్లకు అత్యంత కఠినమైన ఆఫ్‌సైడ్ నిర్ణయాలు తీసుకోవడం, వివాదాస్పదమైన బాల్ లైన్ అవుట్ వంటి ఇన్సిడెంట్లలో ఖచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం చాలా సులువవుతుంది.

స్పేస్ సైన్స్, క్రీడల అద్భుత కలయిక

ఈ ప్రత్యేక ప్రయోగం గురించి నాసా ఇన్స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. “ప్రపంచంలోనే అత్యంత అందమైన ఫుట్‌బాల్ ఆటను మరింత మెరుగుపరచడం కూడా నాసా సైన్స్ లో ఒక భాగమే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మేము చేసే ఇలాంటి ప్రయోగాలు భూమిపై ఉన్న మానవుల జీవన ప్రమాణాలను, సాంకేతికతను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి” అని పేర్కొంది. స్పోర్ట్స్ సైన్స్, స్పేస్ రీసెర్చ్ కలయికతో జరిగిన ఈ ప్రయోగం, రాబోయే ఫిఫా వరల్డ్ కప్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులలో మరిన్ని అంచనాలను, ఆసక్తిని పెంచేసింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..