Reading Time: 2 minutes
TG EAPCET 2026 అడ్మిషన్లు ప్రారంభం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి

హైదరాబాద్, జూన్‌ 19: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో నేటి నుంచి టీజీ ఎప్‌సెట్ అడ్మిషన్ల మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన 1,44,704 మంది అభ్యర్థులు నేటి నుండి ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాలను నమోదు చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. జూన్ 22 నుండి జూన్ 29 వరకు ధృవపత్రాల పరిశీలన జరగనుండగా, జూన్ 25 నుండి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించారు.

ధృవపత్రాల పరిశీలన కోసం సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ ఎ. శ్రీదేవసేన, IAS ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కూడా ఒక కేంద్రాన్ని అదనంగా కేటాయించారు. కన్వీనర్ కోటా సీట్లకు పోటీపడాలంటే అభ్యర్థులు ఈ కేంద్రాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. కాగా, జూలై 4న మాక్ సీట్ అలొకేషన్ విడుదల కానుండగా, జూలై 10న లేదా అంతకంటే ముందే మొదటి విడత తుది సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగుస్తుంది.

ఈ ఏడాది సీట్ల పూర్తి వివరాలు జూన్ 24 నాటికి స్పష్టత రానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విషయంలో విద్యార్థులు కీలక నిబంధనలను గుర్తుంచుకోవాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండి, తహసీల్దారు ఇచ్చిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తేనే బోధనా రుసుముల మినహాయింపు లభిస్తుంది. అయితే, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని భరిస్తుంది. అలాగే, ప్రభుత్వ లేదా కేంద్రీయ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివిన వారికి, లేదా ఎప్‌సెట్‌లో 10 వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

మొదటి విడత అనంతరం జూలై 17 నుండి రెండవ విడత, జూలై 31 నుండి చివరి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతాయి. రెండవ విడతలో సీటు పొందిన అభ్యర్థులు జూలై 25 నుండి జూలై 28 లోపు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ టీసీ, జిరాక్స్ పత్రాలతో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం ఖచ్చితంగా నిబంధనగా విధించారు. ఆగస్టు 12 నుండి ఆగస్టు 13 వరకు కాలేజీ అంతర్గత కోర్సుల మార్పునకు అవకాశం ఉంటుంది. ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 1 నుండి కొత్త విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.