Reading Time: 2 minutes
PM Kisan: రైతులందరి అకౌంట్లోకి రూ.2 వేలు.. కేంద్రం నుంచి సాయం.. చెక్ చేస్కోండిలా..

దేశంలోని రైతులకు భారీ శుభవార్త. జూన్ 20న(శనివారం) రైతుల ఖాతాల్లో సీఎం కిసాన్ నగదు సాయం జమ కానుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా రూ.2 వేలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలో పీఎం-కిసాన్ పథకం 23వ విడత నిధులను స్వయంగా విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తోంది. 23వ విడతలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా 9.44 కోట్లకుపైగా రైతుల బ్యాంక్ అకౌంట్లో రూ.18,880 కోట్లను విడుదల చేయనున్నారు.

దేశంలోనే అతి పెద్ద స్కీమ్

ప్రధాని మోదీ తన పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పీఎం కిసాన్ నిధులను విడదుల చేశాక దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టగా.. తాజా విడత చెల్లింపులతో ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లు దాటింది. పీఎ -కిసాన్ పథకం దేశంలోని సంక్షేమ పథకాల్లో అతి పెద్ద స్కీమ్‌గా పేరు పొందింది.వ్యవసాయ కార్యకలాపాలకు, గ్రామీణ జీవనోపాధికి మద్దతుగా ఈ పథకం నిలుస్తోంది.

ఈకేవైసీ తప్పనిసరి

పీఎం కిసాన్ పథకం కింద అకౌంట్లో డబ్బులు పడాలంటే కేంద్రం కొన్ని షరతులు విధించింది. ఈకేవైసీ చేసుకోకపోతే ఖాతాల్లోకి డబ్బు రాదు. అంతేకాకుండా బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం అవసరం. రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడి) కూడా కలిగి ఉండాలి. ఇక భూమి రికార్డులు సరిగ్గా ఉండాలి. ఈ పనులు చేసుకోకపోతే పీఎం కిసాన్ 23వ వాయిదా డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో.. లేదో తెలుసుకోవచ్చు.

లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందా..?

-pmkisan.gov.inను సందర్శించండి
-‘ఫార్మర్స్ కార్నర్’ విభాగంలోకి వెళ్లండి
-‘బెనిఫిషియరీ స్టేటస్’పై క్లిక్ చేయండి
– మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్‌, అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి
– ‘గెట్ రిపోర్ట్’ పై క్లిక్ చేయండి
– లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో. లేదో చూసుకోండి.