Reading Time: 2 minutes
Manoj Bajpayee %e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8 %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 %e0%b0%a5%e0%b0%bf%e0%b0%af%e0%b1%87%e0%b0%9f%e0%b0%b0

Manoj Bajpayee : సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే మాట తరచూ వినిపిస్తుంది. అయితే కంటెంట్ ఉన్నా థియేటర్లు దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అనేక చిన్న బడ్జెట్ చిత్రాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. స్టార్ హీరోల భారీ చిత్రాల మధ్య మంచి కథలతో తెరకెక్కిన సినిమాలు కూడా ప్రదర్శనకు నోచుకోకపోవడం ఇప్పుడు పరిశ్రమలో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ అంశంపైనే జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ చిన్న సినిమాలకు ప్రభుత్వ స్థాయిలో రక్షణ అవసరమని స్పష్టం చేశారు. తాము కోరేది ఆర్థిక సాయం కాదని, ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించే విధానాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సినమాకి కనీస సంఖ్యలో స్క్రీన్లు, తగినన్ని ప్రదర్శనలు లభించేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు. అలాంటి వ్యవస్థ ఉంటేనే చిన్న సినిమాలు కూడా పెద్ద చిత్రాలతో సమానంగా పోటీ పడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చర్చకు మరో కోణాన్ని ప్రముఖ దర్శకురాలు రీమా కాగ్తీ ప్రస్తావించారు. చిన్న సినిమాలకు ప్రేక్షకుల మద్దతు ఒక్కటే సరిపోదని, వ్యవస్థ నుంచి కూడా ఆదరణ లభించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సమర్థించిన మనోజ్, సమస్య మూలం థియేటర్ల వ్యవస్థలోనే ఉందన్నారు. భారీ చిత్రాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ ప్రభావంతో ఎక్కువ స్క్రీన్లను సొంతం చేసుకుంటున్నారని, దీనివల్ల చిన్న చిత్రాలు ప్రేక్షకులకు చేరకుండానే వెనుకబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి ఈ సమస్య ఒక్క బాలీవుడ్‌కే పరిమితం కాదు. టాలీవుడ్‌లో కూడా సంక్రాంతి, దసరా వంటి పండగ సీజన్లలో పెద్ద సినిమాలు థియేటర్లను ఆక్రమించడం తరచూ కనిపించే పరిస్థితి. దీంతో చిన్న సినిమాలు విడుదల వాయిదా వేసుకోవాల్సి రావడం, లేదా చాలా పరిమిత షోలతోనే సరిపెట్టుకోవడం జరగుతోంది. మంచి కథ, మంచి కంటెంట్ ఉన్నా సరైన ప్రదర్శన లభించకపోతే ప్రేక్షకుల తీర్పు పొందే అవకాశమే లేకుండా పోతుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని మనోజ్ బాజ్‌పాయ్ ఉదాహరణగా చూపించారు. అక్కడ మరాఠీ సినిమాలకు నిర్దిష్ట సంఖ్యలో థియేటర్లు, ప్రైమ్ టైమ్ షోలు కేటాయించే విధానం అమల్లో ఉందని గుర్తుచేశారు. ఇలాంటి విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల సినిమాలకు, చిన్న బడ్జెట్ చిత్రాలకు కూడా విస్తరించాలని ఆయన సూచించారు. దీనివల్ల వైవిధ్యమైన కథలకు, కొత్త దర్శకులకు, కొత్త నటీనటులకు మరింత అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో మనోజ్ బాజ్‌పాయ్ నటించిన తాజా చిత్రం గవర్నర్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంది. చిన్మయ్ డి. మాండ్లేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎస్. వెంకిటరమణన్ పాత్రలో మనోజ్ కనిపించారు. 1990ల ఆర్థిక సంక్షోభ సమయంలో దేశం ఎదుర్కొన్న సవాళ్లను ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రానికి కూడా పెద్ద సినిమాల పోటీ కారణంగా పరిమిత సంఖ్యలోనే థియేటర్లు లభించాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు కూడా సరైన ప్రదర్శన దక్కకపోవడం భారతీయ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితిని మరోసారి బయటపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.