Reading Time: 2 minutes
Weight Loss: జిమ్‌, డైటింగ్ అవసరం లేదు.. ఈ చిన్న మార్పులతో బరువు తగ్గడం చాలా ఈజీ..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. బరువు తగ్గడం కోసం రాత్రి రాత్రికే కఠినమైన డైటింగ్స్ చేయడం, జిమ్‌లలో గంటల తరబడి చెమటలు చిందించడం చేస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి కఠినమైన నియమాలు అవసరం లేదని.. మన దైనందిన జీవితంలో చేసుకునే చిన్న చిన్న మార్పులే ఇందుకు ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకే రోజులో మ్యాజిక్ జరగదు కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఫిట్‌గా ఉండటానికి వైద్య నిపుణులు సూచిస్తున్న ఆ 3 సింపుల్ అండ్ పవర్‌ఫుల్ లైఫ్‌స్టైల్ మార్పులు ఏంటో తెలుసుకుందాం..

రాత్రి పూట స్వీట్ క్రేవింగ్స్‌కు ఇలా చెక్ పెట్టండి

చాలా మందికి రాత్రి భోజనం చేసిన తర్వాత లేదా అర్ధరాత్రి పూట సడన్‌గా స్వీట్లు, చాక్లెట్లు లేదా కేకులు తినాలనే కోరిక కలుగుతుంది. బరువు పెరగడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఈ అలవాటును అదుపు చేయడం చాలా మందికి ఒక పెద్ద సవాలు. అయితే ఇలాంటి సమయాల్లో అధిక క్యాలరీలు ఉండే చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధమైన పండ్లను ఎంచుకోవాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు.. ఒక ఆపిల్ ముక్కపై కొద్దిగా నట్స్ బటర్ రాసుకుని తినడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. పైగా తక్కువ క్యాలరీలతోనే స్వీట్ తినాలనే కోరిక తీరుతుంది.

డైట్ ప్లాన్ – క్యాలరీల లెక్క

ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ కోసం సరైన ఆహార నియమాలతో పాటు రోజువారీ వ్యాయామం సమపాళ్లలో ఉండాలి. ఇందుకోసం మీ రోజువారీ భోజనాన్ని ఇలా ప్లాన్ చేసుకోండి..

ఉదయపు అల్పాహారం : బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. ఇది పూర్తిగా, పోషకాలతో నిండి ఉండాలి.

మధ్యాహ్న భోజనం : లంచ్ ఎప్పుడూ మితంగా ఉండాలి.

రాత్రి భోజనం: డిన్నర్ చాలా తేలికగా, తక్కువ క్వాంటిటీలో ఉండాలి.

ముఖ్యంగా నూనెలో వేయించిన ఫ్రైలు, కొవ్వు పదార్థాలను పక్కన పెట్టి.. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్డు తెల్లసొన వంటి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఒకే రోజులో మార్పు రాదు.. కన్సిస్టెన్సీ ముఖ్యం

శరీరంలో మార్పులు అనేవి ఒకే రోజులో లేదా ఒకే రాత్రిలో జరిగిపోవు. అందుకే నెలకు 10 కిలోలు తగ్గాలి లాంటి భారీ లక్ష్యాలు పెట్టుకోకుండా.. వారంతపు ప్రాతిపదికన చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలి. ఎప్పుడో ఒకసారి వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిరంతరాయంగా, ప్రతిరోజూ చేసే చిన్నపాటి వ్యాయామం మాత్రమే శరీరంలో మెటబాలిజం రేటును పెంచి, కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలసట పడకుండా ఈ సింపుల్ అలవాట్లను లైఫ్‌స్టైల్‌గా మార్చుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్యం మీ సొంతం అవుతుందని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని టీవీ9 నిర్ధారించడం లేదు. జీవన శైలి, ఆహార మార్పులు చేసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)