Reading Time: 2 minutes
‘మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..’ NEET 2026 రీ-టెస్ట్‌కు మరో ఇద్దరు విద్యార్ధులు బలి

చెన్నై, జూన్‌ 19: నీట్‌ రీఎగ్జామ్‌ భయంతో దేశ వ్యాప్తంగా పలువురు విద్యార్థుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్‌ అభ్యర్థుల మరణ మృదంగం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నీట్‌ ఒత్తిడి కారణంగా మరో ఇద్దరు అభ్యర్థులు మృతి చెందారు. జూన్‌ 21న అంటే మరో రెండు రోజుల్లో జరిగే నీట్‌ రీ టెస్ట్‌కు హాజరు కావాల్సిన అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు గురువారం తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లోని త్రగడా ప్రాంతంలోని ఆరిస్టో ఆనందంలో నివసిస్తున్న బాలుడు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.55 గంటలకు తాను ఉంటున్న ఆరో అంతస్తులోని ఫ్లాట్‌ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఘటనలో విద్యార్ధిని మృతి

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అనున్‌కీర్తన (19) అనే విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే రెండుసార్లు నీట్‌ రాసిన అనున్‌కీర్తన నీట్‌ పేపర్‌ లీక్‌తో తీవ్ర నిరాశకు గురైంది. పేపర్‌ లీక్‌ నేపథ్యంలో జూన్‌ 21న మళ్లీ పరీక్షకు హాజరవ్వడానికి తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడింది. మరోసారి పరీక్ష రాయాల్సి రావడంతో కలిగిన నిరాశే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని ఓ సీనియర్‌ పోలీస్ అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, ఆమె మరణానికి దారితీసిన కచ్చితమైన పరిస్థితులను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

దీంతో తమిళనాడులో నీట్‌ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ చిరకాల డిమాండ్‌కు మళ్లీ ఆజ్యం పోసినట్లైంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెళ్లువెత్తాయి. కోయంబత్తూరు, ఇతర ప్రాంతాల్లో సీపీఐ (ఎం), డీఎంకే ఆందోళనలు నిర్వహించాయి. నీట్ పరీక్షను ప్రవేశపెట్టినప్పటి నుంచి తమిళనాడు దానిని నిరంతరం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఖరీదైన ప్రైవేట్ కోచింగ్‌ను భరించగల సంపన్న కుటుంబాల విద్యార్థులకు ఈ పరీక్ష ప్రయోజనం చేకూరుస్తుందని వాదిస్తోంది. 12వ తరగతి బోర్డు పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచినప్పటికీ, ఈ పరీక్ష పేద, గ్రామీణ కుటుంబాల విద్యార్థులను ప్రతికూల స్థితిలో ఉంచుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. నీట్ ప్రవేశపెట్టడానికి ముందు దాదాపు ఒక దశాబ్దం పాటు తమిళనాడు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేది. ఈ పాత విధానం ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటును మెరుగుపరిచిందని వాదిస్తున్నారు. నీట్ నుండి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించినప్పటికీ, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో రాష్ట్రంలో ఈ జాతీయ ప్రవేశ పరీక్ష అమలులో ఉంది. తాజా ఘటన అత్యంత పోటీతో కూడిన ఈ పరీక్ష వల్ల కలిగే మానసిక క్షోభను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ పరీక్షను ప్రవేశపెట్టినప్పటి నుంచి తమిళనాడులో 20 మందికి పైగా అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. మరో వైపు గత రెండు రోజుల్లోనే నలుగురు నీట్ విద్యార్ధులు సూసైడ్‌ చేసుకున్నారు.

నోట్‌: ఆత్మహత్య ఆలోచనలు, మానసిక క్షోభ కలిగితే, దయచేసి వెంటనే మానసిక ఆరోగ్య నిపుణుడిని, కౌన్సిలర్‌ను లేదా నమ్మకమైన సహాయకులను సంప్రదించండి. వాండ్రేవాలా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ 9999666555 లేదా help@vandrevalafoundation.com లేదా TISS iCall 022-25521111 నంబర్‌లను సంప్రదించవచ్చు.