Reading Time: 2 minutes
Virat Kohli Retirement Rumours Dismissed Rcb Ceo Confident Of Four More Ipl Seasons

Virat Kohli Retirement Rumours Dismissed by RCB CEO: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య ఉన్న అనుబంధం ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైనది అనే చెప్పాలి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆర్‌సీబీ జెర్సీలోనే తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాలని పలుమార్లు స్పష్టం చేసిన కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆర్‌సీబీ సీఈవో రాజేష్ మీనన్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానులకు భారీ ఊరటనిచ్చాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీని వేరు చేయడం అసాధ్యమని అన్నారు. ‘ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ ఒకే నాణానికి రెండు వైపు లాంటివి. జట్టు ప్రయాణంలో కోహ్లీ ఎప్పుడూ కీలక భాగంగా ఉన్నాడు. అతను క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత కూడా ఆర్‌సీబీతో ఏదో రూపంలో కొనసాగుతాడని భావిస్తున్నాం. ఆ విషయాన్ని భవిష్యత్తులో పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. కోహ్లీ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ.. అతడు కనీసం మరో మూడు నుంచి నాలుగేళ్లు ఐపీఎల్‌లో ఆడతాడని రాజేష్ మీనన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. అతనిలోని పరుగుల ఆకలి, గెలవాలనే తపన ఏమాత్రం తగ్గలేదు. ఈ సీజన్‌లో కూడా అతడు చూపించిన ఎనర్జీ, పరుగులు, ఆటతీరు అందుకు నిదర్శనం. మరో మూడు నుంచి నాలుగేళ్లు ఆడటంలో ఎలాంటి సమస్య లేదు’ అని తెలిపారు.

చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో ఆర్‌సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ ఎన్నో సంవత్సరాలుగా కలగన్న ట్రోఫీ చివరకు జట్టుకు దక్కింది. ఆ తర్వాత 2026లో కూడా ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది. దీంతో వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ చరిత్ర సృష్టించింది. ఈ విజయాల్లో కోహ్లీ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. జట్టుకు నాయకత్వం, అనుభవం, బ్యాటింగ్ పరంగా అతడు నిరంతరం అండగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా కోహ్లీ తన క్లాస్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. 675 పరుగులు సాధించాడు. 165.84 స్ట్రైక్‌రేట్‌తో తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేశాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో అజేయంగా 75 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కోహ్లీ ఇంకా అత్యున్నత స్థాయిలోనే ఉన్నాడని మరోసారి రుజువైంది. కోహ్లీ త్వరలో ఐపీఎల్‌కు వీడ్కోలు చెబుతాడేమోనని ఆందోళన చెందుతున్న ఆర్‌సీబీ అభిమానులకు సీఈవో రాజేష్ మీనన్ వ్యాఖ్యలు భారీ ఊరటనిచ్చాయి. ఫిట్‌నెస్, ఫామ్, జట్టుపై ఉన్న నిబద్ధతను చూస్తే కోహ్లీ మరో నాలుగేళ్లు ఆర్‌సీబీ తరఫున ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్‌సీబీ అభిమానులు తమ అభిమాన ఆటగాడిని మరికొన్ని సీజన్లు మైదానంలో చూడబోతున్నారన్న ఆనందంలో ఉన్నారు.