Reading Time: < 1 minute

ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు.

Caption of Image.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి.. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఔషధాల సరఫరా , వైద్య సిబ్బంది హాజరు, వారి పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

తనిఖీ అనంతరం ఆసుపత్రి ఉన్నతాధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలు, రోగుల అవసరాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికులు, వారి కుటుంబాలకు అత్యుత్తమ,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆధునాతన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

రోగుల రద్దీ అధికంగా ఉండే ఇలాంటి ఈఎస్ఐ ఆసుపత్రుల్లో విభాగాలుగా వైద్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు, రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మందులు, అదనపు సౌకర్యాలు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.