Reading Time: < 1 minute
Indian Railways Doubles Ticketless Travel Fine New Rules 2026

భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. రైళ్లలో అనధికారిక, టికెట్ లేని ప్రయాణాలను అరికట్టడానికి, రైల్వే కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడానికి జరిమానా మొత్తాన్ని భారీగా పెంచింది. ‘జన్ విశ్వాస్ చట్టం, 2026’ నిబంధనల ప్రకారం.. రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 137, 138 కింద విధించే కనీస జరిమానాను రూ. 250 నుంచి రూ. 500 లకు పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ కొత్త నిబంధన 2026 జూన్ 20 నుంచి అమలుల్లోకి వచ్చింది.

టికెట్ లేని ప్రయాణం: చట్టం ఏం చెబుతోంది?
రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ను మోసం చేసే ఉద్దేశ్యంతో సరైన పాస్ లేదా టికెట్ లేకుండా రైలు పెట్టెలోకి ప్రవేశించడం లేదా ప్రయాణించడం, గత ప్రయాణంలో ఇప్పటికే ఉపయోగించిన సింగిల్ టికెట్/పాస్‌ను మళ్లీ ఉపయోగించడం, లేదా రిటర్న్ టికెట్‌లోని సగాన్ని రెండోసారి వాడటానికి ప్రయత్నించడం వంటి పనులు చేస్తే అవి నేరంగా పరిగణించబడుతుంది.

చెల్లించాల్సిన జరిమానా ఎంత?
పట్టుబడిన ప్రయాణికుడు ప్రయాణించిన దూరానికి సంబంధించిన అసలు టికెట్ ధరతో పాటు సమానమైన అదనపు ఛార్జీని (Excess Charges) చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు ఛార్జీ కనీసం రూ. 500 గా ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు ఎక్కడ ఎక్కాడనేది స్పష్టంగా తెలియకపోతే, ఆ రైలు ప్రారంభమైన స్టేషన్ నుండి లేదా చివరిసారిగా టికెట్లు తనిఖీ చేసిన స్టేషన్ నుండి టికెట్ ధరను లెక్కిస్తారు.

జరిమానా కట్టకపోతే జైలు శిక్ష..
రైల్వే అధికారులు డిమాండ్ చేసినప్పుడు జరిమానా, టికెట్ ధరను చెల్లించడానికి నిరాకరిస్తే లేదా విఫలమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయి. రైల్వే సిబ్బంది సదరు వ్యక్తిపై కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలను వసూలు చేయడంతో పాటు.. జరిమానా చెల్లించనందుకు గాను గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ. 500 వరకు అదనపు జరిమానా.. లేదా ఈ రెండింటినీ విధించే అధికారం కోర్టుకు ఉంటుంది. సెంట్రల్ రైల్వే జోన్ కేవలం మే నెలలోనే 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుండి రూ. 40.85 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు ఎల్లప్పుడూ సరైన టికెట్ కొనుగోలు చేసి, గౌరవప్రదంగా ప్రయాణించాలని రైల్వే శాఖ కోరింది.