Reading Time: 2 minutes
Botsa Satyanarayana Slams Pawan Kalyan Coalition Government

Botsa Satyanarayana : కాకినాడ జిల్లా వెంకటాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కి చెందిన కాపు సామాజికవర్గ నేతల ఆత్మీయ సమావేశం శనివారం ముగిసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక వర్గ కార్యక్రమాలు , కాపులపై జరుగుతున్న దాడుల గురించి నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎవరినో అధికారంలో కూర్చోబెట్టడానికి మేము లేము: బొత్స

సమావేశం అనంతరం మీడియాలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ, తాము ఎవరినో తీసుకెళ్లి అధికారంలో కూర్చోబెట్టడానికి ఈ సమావేశాలు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ. 3 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, మరి గడిచిన కాలంలో కాపులకు ఏం న్యాయం జరిగిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తాము ‘కాపు నేస్తం’ ద్వారా లబ్ధి చేకూర్చామని గుర్తు చేస్తూ.. ఉన్న పథకాలను తీసేస్తామంటే కుదిరేది లేదని హెచ్చరించారు. అధికారం ఉందని రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని, త్వరలోనే విశాఖపట్నం, తిరుపతితో పాటు మరికొన్ని ప్రాంతాలలో కాపు సామాజికవర్గ సమావేశాలు భారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

సాయి కృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యలపై నిలదీత

సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై బొత్స తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన సాయి కృష్ణ తమ కులం వాడేనని, అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ అయితే చంపేస్తారా అని ప్రశ్నిస్తూ, అసలు సాయి కృష్ణ శవం కూడా లేకుండా చేశారని, ఈ ఘటనలో కేవలం పోలీసులను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ (SIT) ఎందుకు వేశారని, సిట్ వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున సేకరించి సాయి కృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని బొత్స ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ అర్హుడా?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనను, ఆయన చేసిన వ్యాఖ్యలను బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. అసలు పవన్ కళ్యాణ్ కాకినాడకు ఎందుకు వచ్చారని, తామేమైనా రౌడీలమా అని ప్రశ్నిస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎవరి తాట ఎవడు తీస్తాడు అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అసలు రాజ్యాంగ పదవిలో ఉండటానికి అర్హుడేనా అని ప్రశ్నిస్తూ, గతంలో దెందులూరులో ఏం జరిగిందో అందరికీ తెలుసని గుర్తు చేశారు.

సమావేశంలో తీసుకున్న ముఖ్య తీర్మానాలు

ఈ ఆత్మీయ సమావేశంలో వైసీపీ కాపు నేతలు ఏకగ్రీవంగా పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. కాపు కార్పొరేషన్‌కు కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వాలని, గతంలో బాకీ పడ్డ రూ. 9 వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యలపై తీవ్ర ఖండన వ్యక్తం చేస్తూ వీటిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అలాగే కాపులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా కాపులను ఇబ్బంది పెడితే వారికి అండగా నిలబడటానికి , సపోర్ట్ చేయడానికి పార్టీ తరపున మూడు ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’ (Taskforce) బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ దుర్మార్గాలను, కాపులపై జరుగుతున్న కుల వివక్షను తాము గట్టిగా ఎదుర్కొంటామని, ఎక్కడ ఏ సంఘటన జరిగిన దోపిడీకి గురవుతున్న తమ సామాజిక వర్గానికి వైసీపీ నేతలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.