
గద్వాల, వెలుగు: మున్సిపల్ కమిషనర్ తన ఇంటిని మున్సిపల్ ఆఫీస్ గా మార్చుకొని ఆఫీస్ కు రావడం లేదంటూ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. టెండర్ ఫారాల స్కూటీనీని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ ఇంటిలో శుక్రవారం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కంప్యూటర్లు, మున్సిపల్ ఆఫీసు సిబ్బంది, కమిషనర్ తో పాటు మరికొందరు అక్కడే ఉండడంతో కౌన్సిలర్లు కమిషనర్ తో వాగ్వివాదానికి దిగారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ షాప్ లకు సంబంధించిన టెండర్ ఫారాలు 117 మున్సిపల్ కమిషనర్ ఇంట్లోనే ఉన్నాయని ఆరోపించారు. తాము వెళ్లినప్పుడు మున్సిపాలిటీ ఆర్ఓఆర్ఐ తో పాటు మిగతా కొంత సిబ్బంది అక్కడే ఉన్నారని, ఆఫీసులో ఎవరు లేకుండా దొంగచాటున కొందరికి అనుకూలంగా మున్సిపాలిటీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతి టెండర్ దారుడుకి జవాబుదారీగా ఉండాలని, ఏ ఒక్క అప్లికేషన్ రిజెక్ట్ అయినా పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్ దేనని మున్సిపల్ కౌన్సిలర్ పులిపాటి వెంకటేశ్‌తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ ఇంట్లో టెండర్లకు సంబంధించిన పనులు చేస్తున్న వ్యవహారానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.