
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఆమేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పురాతన దేవాలయ విగ్రహం చోరీ కేసు సంచలనం రేపుతోంది. సైబాద్ గ్రామంలోని లక్ష్మీనారాయణ ఆలయం నుంచి అష్టధాతుతో తయారైన పురాతన విగ్రహం అదృశ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. కేవలం 14 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిందితుడు గత ఆరు నెలలుగా గూగుల్‌లో పురాతన విగ్రహాల విలువ, వాటి విక్రయాలు, విగ్రహాల్లో దాగి ఉండే విలువైన రత్నాల గురించి విస్తృతంగా సమాచారం సేకరించినట్లు తేలింది. ముఖ్యంగా ఆలయంలోని అష్టధాతు విగ్రహంలో అరుదైన నీలమణి రత్నం పొదిగి ఉందని భావించి దానిపై కన్నేశాడు.
జూన్ 5వ తేదీ రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని దొంగిలించిన నిందితుడు, దానిని తన పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ నీలమణి కోసం విగ్రహాన్ని ముక్కలుగా పగలగొట్టి వెతికాడు. అయితే ఎలాంటి రత్నం లభించకపోవడంతో అవశేషాలను పొలంలోనే పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన మతపరమైన అంశాలకు సంబంధించినది కావడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రామస్థులు నిరసనలు చేపట్టగా, పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా 500 సీసీటీవీ ఫుటేజీలు, వెయ్యికి పైగా మొబైల్ నంబర్ల కాల్ డేటాను విశ్లేషించారు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దొంగతనం చేసిన నిందితుడే తర్వాత గ్రామంలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటూ పోలీసుల దర్యాప్తును గమనించాడని అధికారులు తెలిపారు. చివరకు.. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా విగ్రహ అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెనుక విగ్రహాల అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..