Reading Time: < 1 minute
Bhadradri Kothagudem Pregnant Woman Baby Die Alleged Medical Negligence Gundala Hospital

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో వైద్య వ్యవస్థలోని ఘోర నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. దేవుడిలా ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి సిబ్బంది చేసిన క్షమించరాని తప్పు.. ఓ గర్భిణిని, ఆమె కడుపున పుట్టిన ఆడబిడ్డను అనంతలోకాలకు పంపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 13న గుండాల గ్రామానికి చెందిన వనజ అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్న స్టాఫ్ నర్సే బాధ్యతారాహిత్యంగా కాన్పు చేయడానికి సిద్ధపడింది. నర్సు ఆధ్వర్యంలో వనజ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే, కాన్పు జరిగిన కొద్దిసేపటికే వనజ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. పరిస్థితి చే దాటిపోవడంతో ప్రథమ చికిత్స చేసి, ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వనజ కన్నుమూసింది. కాగా, ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డ అప్పటికే మృతి చెందింది. ఈ విషాద ఘటన తర్వాత తల్లీబిడ్డల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, అంత్యక్రియలు ముగిసిన తర్వాత చితాభస్మం (బూడిద) సేకరిస్తున్న సమయంలో అక్కడ వనజ పొట్ట భాగం కాలిన చోట ఒక కత్తెర లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. కాన్పు చేసే సమయంలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యంగా కత్తెరను కడుపులోనే మర్చిపోయి కుట్లు వేసిందని, ఆ కారణంగానే తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్ అయి తల్లీబిడ్డలు ఇద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణమైన వైద్య నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యురాలైన గుండాల వైద్యాధికారిని (Medical Officer) సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.